హెచ్ఎండీఏ వేలం వేస్తే.. డెవలపర్లు పోటీపడి.. ఎకరానికి వంద కోట్లు పెట్టి కొన్నారు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. హైదరాబాద్ ఎక్కడికో వెళుతుందని.. దుబాయ్, లండన్, న్యూయార్క్ స్థాయికి చేరుకుంటుందని చాలామంది భావించారు. కానీ, కోకాపేట్‌లో నీటి కొరత ఏర్పడుతుందని.. ప్రజలు నీరు కొనుక్కోవాల్సి వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మంచి నీటి ట్యాంకర్ల ద్వారా నీరు కొనుక్కోవాల్సి వస్తుందని అనుకోలేదు. అసలెందుకీ దుస్థితి ఏర్పడింది?
కోకాపేట్ అంటే హాట్ కేక్. పాశ్చాత్య నగరాల తరహాలో డెవలప్ కావాల్సిన ప్రాంతం. కాకపోతే, ప్రస్తుతమున్న గేటెడ్ కమ్యూనిటీల్లో, లగ్జరీ విల్లాలు, ఇతర అపార్టుమెంట్లలో నీటి కొరత ఏర్పడింది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఆశించిన స్థాయి కంటే తక్కువగా కోకాపేట్‌లో నీటి సరఫరా చేస్తోంది. పక్కనే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి జలాశయాలు ఉన్నప్పటికీ ఎందుకీ దుస్థితి ఏర్పడిందనే ప్రజల ప్రశ్నకు ఎక్కడా సమాధానం దొరకని పరిస్థితి. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలకు ప్రతిరోజు వంద కేఎల్ మంచినీటిని అందజేయాల్సిన వాటర్ బోర్డు.. కేవలం 10 నుంచి 12 కేఎల్ వాటరే అందజేస్తోంది. ఫలితంగా, మంచినీరు సరిపోక.. ట్యాంకర్లతో నీళ్లను తెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పలు రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీలు గగ్గోలు పెడుతున్నాయి. ఫలితంగా, నెలకు 3 నుంచి 5 లక్షల దాకా మంచి నీరు కొనుక్కోవడానికి వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నాయి. అంతేకాదు, ఈ మంచి నీటి బిల్లు మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ కూడా కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి, నీళ్లను కొనుక్కోవడానికి నెలకు సుమారు మూడు నుంచి ఐదు లక్షల దాకా వివిధ కమ్యూనిటీలు వెచ్చిస్తున్నాయని సమాచారం.
కోకాపేట్‌లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేశాక.. వేలం పాటల్ని నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండేది కాదు. రహదారులతో పాటు విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యం వంటివి పొందుపరిస్తే బిల్డర్లకూ అపార్టుమెంట్లను కట్టుకోవడానికి సులువుగా ఉండేది. కోకాపేట్ సర్వీస్ రోడ్డు నుంచి నియోపోలిస్ దాకా ఆకాశహర్మ్యాల నిర్మాణం జరుగుతోంది. మరి, వాటికి క్రమం తప్పకుండా మంచినీటిని సరఫరా చేసే సామర్థ్యం వాటర్ బోర్డుకు ఉందా? లేక ఆయా ఆకాశహర్మ్యాల్లో నివసించేవారు మంచినీటి ఎద్దడికి ఎదుర్కోవాల్సి వస్తుందా? అనే సందేహాన్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ ఇబ్బందిని అధిగమించడానికి వాటర్ బోర్డు ఎలాంటి ప్రణాళికల్ని రచిస్తుందోనని ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.