ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ అనేది పెట్టుబడిదారులకు మంచి ఆప్షన్ గా మారింది. భూమిపై మనుషులు ఉన్నంతకాలం రియల్ రంగానికి ఎలాంటి ఢోకా ఉండదనేది ఎవరూ కాదనలేని నిజం. దీంతో చాలామంది పెట్టుబడిదారులు ప్రాపర్టీల కొనుగోలుకే మొగ్గు చూపిస్తున్నారు. అయితే, స్తిరాస్థి రంగంలో పెట్టుబడి పెట్టేముందు చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మనకు వచ్చే ఆదాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తెలివిగా ఆలోచించి పెట్టుబడి పెడితే గణనీయమైన లాభాలు ఆర్జించొచ్చు. ఈ విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటంటే..
సరైన మార్కెట్..
రియల్ రంగంలో అత్యంత కీలకమైన అంశం సరైన మార్కెట్ ను ఎంచుకోవడం. ఏ సెగ్మెంట్ లో పెట్టుబడి పెడితే పెడితే బాగుంటుందో ఆలోచించుకోవాలి. రియల్ రంగంలో ఇదీ ఐడియల్ మార్కెట్ అని ప్రత్యేకంగా ఉండదు. అందువల్ల మనమే అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలి. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆరా తీసుకోవాలి. ఆ మార్కెట్ వృద్ధి బాగా ఉందంటే అక్కడ మీకు ఎక్కువ రిటర్నులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రాపర్టీలు దొరకడం కష్టమవుతుంది. అదే భవిష్యత్తులో ఆ ఏరియా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తే.. అక్కడి ప్రాపర్టీలను బేరం ఆడి తక్కువకు కొనుగోలు చేయొచ్చు. అయితే, లాభాల ఆర్జనకు కాస్త సమయం పడుతుంది.
పరపతి..
పెట్టుబడి పెట్టే ముందు చూసుకోవాల్సిన మరో కీలకమైన అంశం.. పరపతి. మీరు తక్కువ పెట్టుబడి పెడితే రిస్కు కూడా అంతే తక్కువ ఉంటుంది. అయితే, ఈ తక్కువ పెట్టుబడి వల్ల మీరు కొనే ప్రాపర్టీల సంఖ్య తగ్గుతుంది. అలాకాకుండా మీరు మీ పెట్టుబడులను వివిధ మార్కెట్లలో పెడితే.. అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా సెగ్మెంట్ లో నష్టం వచ్చినా మిగిలిన సెగ్మెంట్లు దానిని భర్తీ చేస్తాయి.
అవసరమైన సమాచారం..
మనం పెట్టుబడి పెట్టే రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి. వీలైనంత లోతుగా దాని గురించి పరిశోధించాలి. అప్పుడే మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. మార్కెట్ పై పట్టు సాధిస్తే.. మీరు ఆత్మ విశ్వాసంతో నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా అసలు ఈ విషయంలో ఏది మంచి ఏది కాదు అని అంచనా వేసే ఉన్నత స్థితిలో మీరు ఉండే అవకాశం ఉంది.
సహనం..
విజయవంతమైన రియల్ పెట్టుబడికి సహనం అనేది తారకమంత్రం. రాత్రికి రాత్రే అన్నీ మారిపోయి, బోలెడు లాభాలు వచ్చేయాలని అని కంగారుపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మనం తీసుకుంటున్న నిర్ణయం సరైనదా కాదా అనే విషయాన్ని అన్ని కోణాల్లోనూ సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలి. అప్పుడే లాభాలబాటలో పయనిస్తాం. ఇందుకు కాస్త సమయం పట్టినా సహనంతో వ్యవహరించాలి.
రిస్క్ తగ్గించుకోవాలి..
మీ కంటే ముందుగా ఈ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి విజయా సాధించినవారితో మాట్లాడండి. వారి అనుభవాలు తెలుసుకోండి. అలాగే మీరు ఒప్పందం చేసుకునేటప్పుడు అన్ని వివరాలతో డాక్యుమెంట్స్ పక్కాగా ఉండేలా చూసుకోండి. సదరు ప్రాపర్టీ ఎలాంటి వివాదాల్లో లేదని, స్థానిక యంత్రాంగానికి ఎలాంటి బకాయిలు లేవని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. అలాగే ప్రాపర్టీని అప్పగించేటప్పుడు పనులన్నీ పూర్తి చేసి సంపూర్ణ స్థితిలోనే అప్పగించేలా కచ్చితమైన నిబంధనలు పెట్టండి.
నిష్క్రమణ వ్యూహాలు..
ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. అవసరమైన సమయంలో దానిని అమ్మి సొమ్ము చేసుకునే మార్గాలు ఏం ఉన్నాయో కూడా ముందుగానే తెలుసుకోవాలి. కొనుగోలు తర్వాత అమ్మితే.. దాని విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అనేది పరిశీలించాలి. అమ్మినా అమ్మకపోయినా ఈ బ్యాకప్ ప్లాన్ కూడా ముందుగానే ఉండాలి.