హైదరాబాద్ నిర్మాణ రంగంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు గిరాకీ లేనే లేదు. ప్రధానంగా కాస్త మధ్యస్థాయి అపార్టుమెంట్లలో వీటిని కొనేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం లేకపోలేదు. గత ఒకట్రెండేళ్లలో పలువురు బిల్డర్లు చదరపు అడుక్కీ 1000 నుంచి 2000 దాకా రేట్లను పెంచేశారు. దీంతో, అప్పటివరకూ రూ.60-70 లక్షలకు రావాల్సిన ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ ఒక్కసారిగా కోటి రూపాయలకు చేరుకుంది. దీంతో, ఎక్కడో ఊరి చివర్లో కోటీ రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనడం బదులు.. నగరానికి కాస్త చేరువలోనే గేటెడ్ కమ్యూనిటీల్లో ఫ్లాట్ కొనవచ్చని చాలామంది భావిస్తున్నారు. అందుకే, వీరంతా స్టాండ్ ఎలోన్ అపార్టుమెంట్లు, మధ్యస్త నిర్మాణాల్లో కొనుగోలు చేయడానికి ఇష్టపడట్లేదు. దీంతో, నగరంలోని అనేక ప్రాంతాల్లో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు గిరాకీ పడిపోయింది. ఇది ఇలాగుంటే, బడా గేటెడ్ కమ్యూనిటీల్లో ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు ఎక్కడ్లేని గిరాకీ ఉంది. ఉదాహరణకు, ప్రెస్టీజ్ హైఫీల్డ్స్ ప్రాజెక్టును తీసుకుంటే, ప్రస్తుతం అమ్మకానికి కేవలం టూ బెడ్రూమ్, ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీన్ని బట్టి బయ్యర్ల ఆలోచనా సరళిని డెవలపర్లు అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా నిర్మాణాల్ని డిజైన్ చేస్తే ఉత్తమం.