మన మనసుకు నచ్చే గృహాన్ని ఎంచుకుంటే ఎంచక్కా ప్రశాంతంగా జీవితాన్ని గడిపేయవచ్చు. పైగా, అపార్టుమెంట్లలో లగ్జరీ సదుపాయాల్ని ఆస్వాదించిన తర్వాత కాస్త పెద్ద గృహానికి మారడం అంత సులువేం కాదు. దానికోసం కొంత శ్రమించాలి. ఓపికతో వెతకాలి. అలసిపోకుండా నచ్చిన గృహం దొరికేంత వరకూ వెతుకుతూనే ఉండాలి. అలా ప్రయత్నిస్తేనే రమ్య జితేష్ మాదిరిగా ఆకర్షణీయమైన ఇంటిని సొంతం చేసుకోవచ్చు. మరి, ఆమె కుటుంబం డబుల్ బెడ్‌రూం ఫ్లాట్ నుంచి విల్లా కమ్యూనిటీలోకి ఎలా మారింది? ఈ క్రమంలో ఏయే అంశాల్ని పరిశీలించారో ఆమె మాటల్లోనే..
పెళ్లయినప్పట్నుంచి పిల్లలు పుట్టేంతవరకూ ఎంచక్కా గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో నివసించాం. కాకపోతే, పిల్లలు పెరిగి పెద్దగా అవుతుండటం, తల్లీదండ్రులు మాతోనే ఉంటున్న క్రమంలో కాస్త పెద్ద ఇల్లు అవసరమని అనుకున్నాం. అందుకే, మా కలల గృహాన్ని త్రీ బెడ్ రూముగా మార్చుకుందామనే నిర్ణయానికొచ్చేశాం. సకల సౌకర్యాలతో అందమైన గేటెడ్ కమ్యూనిటీలోనే నివసించాం. ఆట స్థలాలు, ఉద్యానవనాలు, అన్ని క్రీడా కోర్టులు మరియు క్లబ్ హౌస్ వంటివి ఉండేవి. మళ్లీ అలాంటి గేటెడ్ కమ్యూనిటీలోకే మారాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇక, మా వేట మొదలైంది.
కొనడమా? అద్దెకా?
ఆన్ లైన్ లో రియల్ ఎస్టేట్ ఏజెంటును సంప్రదించాం. కాస్త పెద్ద సైజు గృహం కోసం వెతకడం ఆరంభించాం. సొంతంగా కొనుక్కోవడమే మా ముందున్న ప్రాధాన్యత. లేకపోతే అన్నివిధాలుగా నచ్చితే అద్దెకైనా దిగాలనే నిర్ణయానికొచ్చాం. అయితే, నెలల తరబడి వెతికినా మాకు సరిపోయే ఫ్లాటు దొరకలేదు. మరోవైపు బాబుని స్కూలులో చేర్పించే సమయం వచ్చేసింది. ఇక లాభం లేదనుకుని, స్కూలు దగ్గర్లో ఉంటే బెటరని అనిపించింది. ఒకరోజు ఉదయం పూట పాఠశాలకు వెళుతుండగా.. ఒక విల్లా నిర్మాణం జరుగుతుందని గమనించాం. అందులోకి అడుగుపెట్టాం. చూడటానికీ చాలా బాగుంది. ఓ బడా చిల్డ్రన్ పార్క్ పక్కనే వ్యక్తిగత విల్లా మాకు నచ్చింది. క్లబ్ హౌజ్ ఆకట్టుకునేలా ఉంది. ప్రధాన రహదారికి కూతవేటు దూరంలోనే విలాసవంతంగా కనిపించింది. పైగా, ఇంటీరియర్స్ చేసుకోవడానికి చక్కటి స్కోప్ ఉందనిపించింది. గేటెడ్ కమ్యూనిటీలోని ఫ్లాట్ ధరకే వ్యక్తిగత విల్లా కొనుక్కునే ఆలోచన మెరుగైన నిర్ణయం అనిపించింది.
ఇంటికెళ్లాక కూర్చుని మేం కూలంకషంగా చర్చించాం. అపార్టుమెంట్‌లో కొంతకాలం జీవించిన తర్వాత.. వ్యక్తిగత విల్లాలో ఉండటం సరికొత్త అనుభూతినిస్తుందని అనిపించింది. విల్లా అంటే భూమి మీద పెట్టే పెట్టుబడి కాబట్టి.. అవి ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గే అవకాశమే ఉండదు. పైగా, మేం ఎంచుకున్నది గేటెడ్ విల్లా టౌన్ షిప్. మధ్యలో కొన్ని ప్లాట్లు ఉన్నప్పటికీ, ఒకటే రకమైన ఆలోచనలున్నవారు.. అద్భుతమైన పొరుగువారు ఉండటంతో సంతోషమనిపిస్తుంది. మా విల్లా సరిగ్గా పార్క్ ముందు ఉంది. రహదారి వైపు ఉద్యానవనం ఎల్లప్పుడూ పలకరిస్తుంటుంది. తగినంత ఖాళీ స్థలం ఉండటంతో ఎక్కువ చెట్లను నాటడానికి అవకాశం లభించింది.
మీ డ్రీమ్ హోమ్.. ఎలా సాకారం?
మీ కలల గృహాన్ని ఎంచుకునేందుకు ఎలాంటి ప్రయత్నాన్ని చేశారు? ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు.. వాటిని ఎలా పరిష్కరించారు? ఎన్నాళ్లకు మీ నచ్చిన ఇంటిలోకి అడుగుపెట్టారు? మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. మీ కుటుంబ ఫోటోలు, ఇంటి ఫోటోలు కూడా పెట్టండి. మాకు నచ్చిన వాటిలో ప్రచురిస్తాం. మీ అనుభవాల్ని REGNEWS21@GMAIL.COMకి మెయిల్ చేయండి.