పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ సమక్షంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జెండా ఊపి మంగళవారం ఆరంభించారు. ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఇ-ప్రిక్స్ లో.. ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్ మరియు నిజాం కాలేజీ ప్రాంతాల్ని కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి.
ఫిబ్రవరి 11 తర్వాత పర్యాటకుల కోసం ఈ బస్సులను వినియోగించేందుకు యోచిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే, డబుల్ డెక్కర్ బస్సులనేవి నగరానికి కొత్తేం కాదు. నిజాం సర్కార్ హయంలోనే ఇవి ఆరంభమయ్యాయి. 2003 వరకూ నగరంలో తిరిగాయి. మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ వరకూ 5వ నెంబరు బస్సు, సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకూ 10వ నెంబర్ డబుల్ బస్సులు వంటివి 2003 వరకూ తిరిగేవి. కానీ, ఆతర్వాత ఈ బస్సులను ఆర్టీసీ పక్కన పెట్టేసింది.
ట్విట్టర్‌లో పౌరుల అభ్యర్థన మేరకు, ఆ బస్సులలో ప్రయాణించిన మధుర జ్ఞాపకాలను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ఆరంభించేందుకు గల అవకాశాల్ని అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. కాకపోతే, మెట్రో రైలు స్టేషన్ల కారణంగా.. ఏయే ప్రాంతాల్లో ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడిపే అవకాశం ఉంటుందనే అంశాన్ని ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క బస్సు కోసం హెచ్ఎండీఏ రూ.2.16 కోట్లను ఖర్చు చేసింది. ఏడు సంవత్సరాల పాటు బస్సు నిర్వహణ తయారీ సంస్థే భరిస్తుంది. ఈ బస్సుల్లో డ్రైవర్‌తో పాటు 65 మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ తో పని చేస్తాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే.. సుమారు 150 కిలోమీటర్ల వరకూ పని చేస్తుంది. రెండు లేదా రెండున్నర గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు