ఇల్లు, ప్లాట్లు కొనేముందు ఎవరైనా మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యా సంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి గురించి నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా అన్ని విధాలుగా అభివృద్ది చెందిన హైదరాబాద్ శివారులోని నాగార్జున సాగర్ రోడ్డు వైపు చూస్తున్నారు అంతా. ఔను.. అవును ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ఉన్న సాగర్ రోడ్డు పరిసర ప్రాంతాల వైపు ఎక్కువ శాతం మంది దృష్టి సారిస్తున్నారు.
హైదరాబాద్ శివారులోని నాగార్జున సాగర్ రోడ్డు చుట్టుపక్కల ప్రాంతంలో అందుబాటు ధరలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. వ్యక్తిగత గృహాలు, విల్లాలూ లభిస్తున్నాయి. తక్కువ ఖర్చులో సొంతిల్లు ఉండాలని కోరుకునేవారికి ఇదొక్కటి చక్కటి ప్రత్యామ్నాయంగా మారింది. సాగర్ రోడ్డు చుట్టుపక్కల కొన్నేళ్ల క్రితమే విద్యా సంస్థలు వెలిశాయి. సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోనే దిలుసుఖ్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, వనస్థలీపురం, హయత్ నగర్ వంటి అన్ని రంగాల్లో అభివృద్ది చెందిన ప్రాంతాలున్నాయి.
కూతవేటు దూరంలో ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఉండగా, 10 నిమిషాల వ్యవధిలో దిల్ సుఖ్ నగర్ చేరుకోవచ్చు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పలు ఐటీ కంపెనీలకు ఇక్కడ నుంచి 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. నాగార్జున సాగర్ కు వెళ్లే రహదారితో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ఉండటంతో కనెక్టివిటీ అందరికి అందుబాటులో ఉంది.
దిల్ సుఖ్ నగర్, మీర్ పేట్, నాగోల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు అధికంగా ఉండటం సాగర్ రోడ్డుపై దృష్టి పడటానికి మరో కారణం. బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్, మన్నెగూడ, బొంగుళూరు, శేరిగూడ, ఇబ్రహీంపట్నం వరకు వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో వెంచరు సుమారు 2 ఎకరాల నుంచి 15 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు, ప్రాంతం బట్టి డీటీసీపీ లేఅవుట్ లో చదరపు గజం 20 వేల నుంచి మొదలు 42 వేల వరకు ధరలున్నాయి.
సాగర్ రింగ్ రోడ్డు నుంచి మొదలు ఇబ్రహీంపట్నం వరకు సుమారు 30 నివాస ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. బీఎన్ రెడ్డి నగర్, తుర్కయంజాల్ లో లో ఎక్కువగా ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్టుమెంట్ ప్రాజెక్టుల్ని కట్టే డెవలపర్లు పెరిగారు. ఎల్బీ నగర్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాంటే సుమారు 80 నుంచి 90 లక్షల రూపాయలు అవుతుంది. సాగర్ రింగ్ రోడ్డుకు కాస్త దూరంలో అల్మాస్ గూడ, ఇంజాపూర్, తుర్కయంజాల్ వంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 50 లక్షల నుంచి 55 లక్షలకు దొరుకుతోంది.
బొంగ్లూరుకు సమీపంలో అయితే 45 లక్షల రూపాయల నుంచి కూడా ఫ్లాట్స్ లభిస్తున్నాయి. ఇండిపెండెంట్ ఇళ్లయితే.. రూ. 60 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ధరలున్నాయి. నగరంలోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేవలం 40 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా సాగర్ రోడ్డు మార్గంలో ఇల్లు కొంటున్నారు. ఓపెన్ ప్లాట్లు సైతం చదరపు గజం 10 వేల రూపాయల నుంచి దొరుకుతుండటంతో.. భవిష్యత్తులో ఇల్లు నిర్మించుకోవాలని అనుకుంటున్నవారు ఇంటి స్థలాన్ని కొంటున్నారు. రానున్న రెండు, మూడేళ్లలో సాగర్ రోడ్డు రూపురేఖలు మరింత మారనున్నాయని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.