20 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో నానక్ రాంగూడ
చ.గ. 1500 నుంచి 2 లక్షలకు పెరిగిన నానక్ రాంగూడ
హైదారాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నానక్‌రాంగూడకు ప్రత్యేక స్థానం ఉంది. భాగ్యనగరంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తరువాత నానక్రాంగూడకే అంతటి ప్రాధాన్యం ఉందని చెప్పాలి. ఒకప్పుడు గ్రామంగా ఉన్న నానక్ రాంగూడ 20 ఏళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో మారిపోయింది. ఇంకా చెప్పాలంటే గత పదేళ్లలో నానక్ రాం గూడ రూపురేఖలు గుర్తు పట్టలేనంతగా మారాయి. నానక్‌రాంగూడలో రియల్ ఎస్టేట్ ప్రారంభమైనప్పుడు.. వెయ్యి రూపాయలు కూడా పలకని చదరపు గజం.. ఇప్పుడు రెండు లక్షల రూపాయలకు పెరిగిందంటే.. ఎంతలా అభివృద్ది చెందిందో అర్దం చేసుకోవచ్చు. ఇక నానక్‌రాంగూడలో అపార్టుమెంట్స్, విల్లాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
హైదరాబాద్‌లో ఇప్పుడు ప్రధానమైన ప్రాంతాల్లో నానక్‌రాంగూడ గురించి ప్రత్యేంగా చెప్పుకోవాలి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ తరువాత అంతటి ప్రముఖమైన నివాస, వాణిజ్య ప్రాంతాల జాబితాలో నానక్‌రాంగూడ ఉంటుంది. అయితే 20 ఏళ్ల క్రితం నానక్‌రాంగూడకు, ఇప్పటి నానక్‌రాంగూడకు పోల్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు గ్రామంగా ఉన్న నానక్‌రాంగూడ ఇప్పుడు సైబరాబాద్ కు సెంటర్ పాయింట్ అయిపోయింది.
గ్రేటర్ సిటీ రియల్ ఎస్టేట్ రంగంలో నానక్‌రాంగూడ హాట్ కేక్ అని చెబుతున్నారు మార్కెట్ రంగ వర్గాలు. ఔను, హైదరాబాద్ లోని ప్రీమియం ప్రాంతాలతో పోటీపడుతోంది నానక్‌రాంగూడ. ఒకప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో నివసించిన సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఇప్పుడు నానక్‌రాంగూడ పరిసరాలకు నివాసం మార్చుకుంటున్నారు. నానక్‌రాంగూడ కేవలం నివాసాలకే కాకుండా ఐటీ, వాణిజ్య కేంద్రంగా మారడంతో అందుకోలేనంత డిమాండ్ పెరిగింది.
నానక్‌రాంగూడ కు మంచి కనెక్టివిటీ ఉండటం అనుకూలమని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉంటుంది. ఐటీ కారిడార్ పక్కనే ఉండటం మరో ప్లస్ పాయింట్. జూబ్లీహిల్స్ నుంచి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే. ఫిల్మ్ నగర్ నుంచి 10 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఐటీ కారిడార్ గచ్చిబౌలి నుంచి ఐదు నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. అటు మెహిదీపట్నం నుంచి 15 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు.
ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్స్, భారీ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, స్పోర్ట్స్ అకాడమీలు.. ఇలా కావాల్సినవన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి కోటి, మెహిదీపట్నం నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్ కు కేవలం 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇలా నానక్‌రాంగూడ కు అన్ని విధాలుగా కనెక్టివిటీ ఉండటంతో ఎక్కడికైనా ట్రాఫిక్ సమస్య లేకుండా ఈజీగా వెళ్లిపోవచ్చు.
నానక్ రాంగూడలో సరిగ్గా 20 ఏళ్ల క్రితం 2004 లో చదరపు గజం కేవలం 1500 నుంచి రెండు వేల రూపాయలు మాత్రమే ఉండేదని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. నానక్ రాంగూడలో రామానాయుడు స్టూడియో, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, పక్కనే ఐటీ కారిడార్ అభివృద్ధితో శరవేగంగా డెవలప్ అయ్యింది. నానక్‌రాంగూడ లో రియల్టీ ప్రాజెక్టులు క్రమ క్రమంగా మొదలయ్యాయి.
మరీ ముఖ్యంగా గత పదేళ్ల నుంచి అపార్ట్ మెంట్ ల నిర్మాణం, విల్లాల నిర్మాణం జోరందుకుంది. ఇప్పుడు నివాస, వాణిజ్య భవనాలను ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం చదరపు గజం 1500 రూపాయలున్న ధర.. ఇప్పుడు చదరపు గజం 2 లక్షలకు పెరిగింది. ఇక పదేళ్ల క్రితం అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 3 వేలు ఉండగా.. ఇప్పుడు చదరపు అడుగు ప్రాజెక్టును బట్టి 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు ధరలున్నాయి.
నానక్ రాంగూడలో విల్లాలకు భారీ డిమాండ్ ఉంది. అందుకు అనుగునంగా నానక్ రాంగూడలో పలు రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా విల్లాల నిర్మాణం చేపడుతున్నాయి. ప్రాంతం, ప్రాజెక్టు, విస్తీర్ణం, సౌకర్యాలను బట్టి ఒక్కో విల్లా 8 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల వరకు ధరలున్నాయి. మరోవైపు నానక్ రాంగూడలో ఇంటి స్థలాలు సైతం అందుబాటులో ఉండటంతో వాటికి మంచి డిమాండ్ ఉంది.
భారీ అపార్ట్ మెంట్స్ ప్రాజెక్టులతో పాటు స్టాండ్ లోన్ అపార్ట్ మెంట్ నిర్మాణాలు కూడా అధికంగా ఉండటంతో మధ్య తరగతి వారు సైతం నానక్ రాంగూడలో సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ రోడ్డుకు కాస్త లోపలికి కోటి రూపాయల నుంచి కూడా అపార్ట్ మెంట్ లో ఫ్లాట్స్ లభిస్తున్నాయి. దీంతో మిడిల్ క్లాస్ వాళ్లు తమ సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు నానక్‌రాంగూడ ను ఎంచుకుంటున్నారు. రానున్న రోజుల్లో నానక్ రాంగూడ మరింత అభివృద్ది చెందనుండటంతో ఇక్కడ ఇళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
This website uses cookies.