హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ హెచ్‌ఎండీఏకు ఉన్న ఖాళీ భూముల్లో.. టౌన్‌షిప్‌లను నిర్మించడం ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హెచ్‌ఎండీఏ కీలక భూమిక పోషించాలన్నారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా సచివాలయంలోని తన కార్యాలయంలో పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”టౌన్‌షిప్‌ల నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న రహదారుల విస్తరణ ఎంతవరకు ఉంటుందన్నది మార్క్ చేయాలి. దీని ద్వారా ఇళ్లు నిర్మించడం, తర్వాత తొలగించాల్సిన అవసరం ఉండదు. లేఅవుట్లలో మార్టిగేజ్ చేసిన ప్లాట్లను అభివృద్ధి చేయకుండా వదిలేస్తున్నారు. వాటిపై దృష్టి సారించాలి. ఎల్‌ఆర్‌ఎస్ కింద వచ్చిన 39 లక్షల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి. పారిశ్రామికవాడల్లో వేలం ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లను వినియోగించని పక్షంలో వాటిని వెనక్కు తీసుకోవాలి. అది సాధ్యం కాని పక్షంలో ప్రభుత్వ వాటాను రాబట్టాలి. హెచ్‌ఎండీఏ పరిధిలో చెరువులకు సంబంధించి ఒక్కో సందర్భంలో ఒక్కో సంఖ్య చెబుతున్నారు. వాటిని శాస్త్రబద్ధంగా నమోదు చేయాలి” అని భట్టి విక్రమార్క ఆదేశించారు.
ఎక్కడ వదిలేశారో..
అక్కడే ఆరంభం!
ఔటర్ చుట్టూ టౌన్ షిప్పులను ఏర్పాటు చేయాలని దివంగత నేత వైఎస్సార్ జమానా నుంచి చెబుతున్నారని.. కానీ, ఇంతవరకూ అది కార్యరూపం దాల్చలేదని ప్రజలు అంటున్నారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అదే పాత మాట చెబుతోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్పులను ఏర్పాటు చేయడానికి.. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల గురించి తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ స్థలసేకరణ చేశారు? ఆ ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉంది? వంటివి కనుక్కోవాలి. గత ప్రభుత్వం వదిలేసిన దగ్గర్నుంచి శాటిలైట్ టౌన్‌షిప్పుల ప్రక్రియను ఆరంభించాలి. అంతేతప్ప, మళ్లీ ఈ ప్రక్రియను కొత్తగా ఆరంభిస్తే కాలయాపన జరుగుతుంది. అందుకే, వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి శాటిలైట్ టౌన్‌షిప్పు పనుల్ని ఆరంభించాలని ప్రజలు కోరుతున్నారు.