హెచ్ఎండీఏ డైరెక్టర్ అక్రమార్జన కేసును ఈడీకి బదిలీ అయ్యిందా అంటే.. ఔననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఏసీబీ విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమతుల్ని అడ్డగోలుగా మంజూరు చేయడం, అందుకు ప్రతిఫలంగా రియల్టర్ల నుంచి ముడుపులు తీసుకోవడం, పైస్థాయి అధికారుల సూచనల మేరకు పలు ప్రాజెక్టులకు అడ్డగోలుగా అనుమతుల్ని మంజూరు చేయడం.. అందుకు ప్రతిఫలంగా కోట్ల రూపాయలు చేతులు మారడం వంటి కారణాల కారణంగా.. బాలకృష్ణ కేసును ఈడీకి బదిలీ చేశారని తెలిసింది.
అరవింద్ కుమార్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఉండటంతో.. బాలకృష్ణ రెచ్చిపోయాడని సమాచారం. హెచ్ఎండీఏలో డబుల్ రోల్, డబుల్ క్యాష్ పద్ధతిలో బిల్డర్లకు, రియల్టర్లకు, ఇన్‌ఫ్రా ఓనర్లకు, ల్యాండ్ వెంచర్ల యజమానుల ఫైల్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు ఆయనే హెచ్ఎండీఏ డైరెక్టర్. అంటే, అనుమతుల్ని మంజూరు చేసేది అతను. మరోవైపు ఆ అనుమతికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ తెప్పించే పురపాలక శాఖ డైరెక్టర్ కూడా అతనే. బాలకృష్ణ ఔనంటే చాలు.. అరవింద్ కుమార్ కూడా ఓకే అనేవాడు. ఇలా, అనేక ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల విషయంలో ఇద్దరిది ఒకే మాటగా ఉండేది. అదే, పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఎంజీ గోపాల్ ఉన్నప్పుడు.. హెచ్ఎండీఏ కమిషనర్‌గా చిరంజీవులు ఉండేవారు. ఆ సమయంలో ఎంజీ గోపాల్ నిబంధనల విషయంలో ఎంతో స్ట్రిక్టుగా ఉండేవారు. తర్వాతి క్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్ కావడంతో.. బాలకృష్ణకు భలే కలిసొచ్చింది.
బాలకృష్ణను పురపాలక శాఖలో కొనసాగించడం మాజీ మంత్రి కేటీఆర్ ఏమాత్రం ఇష్టముండేది కాదు. పలు సందర్భాల్లో మాజీ మంత్రి బాలకృష్ణ వ్యవహారశైలి మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కాకపోతే, పురపాలక శాఖలో అతను తప్ప వేరే తెలివైన అధికారులు లేరనే విధంగా పరిస్థితి ఏర్పడింది. అందుకే, బాలకృష్ణ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. హైదరాబాద్ బిల్డర్లు కేటీఆర్ అంటే భయపడరు కానీ.. బాలకృష్ణ అంటే ఒక్కసారిగా అటెన్షన్ అయ్యేవారు. ఎందుకంటే, అనుమతుల్లో అతనిదే క్రియాశీలక పాత్ర కాబట్టి.. అధిక ప్రాధాన్యతనిచ్చేవారు.
This website uses cookies.