- ట్రంప్ వరల్డ్ సెంటర్ ప్రాజెక్టు డెవలప్ మెంట్ కు కలిసి పనిచేయాలని నిర్ణయం
పుణెలో చేపట్టనున్న కమర్షియల్ ప్రాజెక్టు ట్రంప్ వరల్డ్ సెంటర్ డెవలప్ మెంట్ కోసం కుందన్ స్పేసెస్ తో రియల్టీ సంస్థ ట్రిబెకా డెవలపర్స్ జట్టుకట్టాలని నిర్ణయించింది. అమెరికాకు చెందిన ట్రంప్ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టు ద్వారా భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశిస్తోంది. 4.3 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో రెండు ఐకానిక్ గ్లాస్ టవర్లు ఉంటాయి. ఒక్కో టవర్లో 27 అంతస్తులు నిర్మిస్తారు. అన్నీ ఆఫీస్ స్పేస్ కోసమే వినియోగిస్తారు. మొత్తం 16 లక్షల చదరపు అడుగుల స్సేస్ అందుబాటులోకి రానుంది.
ఒక టవర్ లో స్పేస్ ను విక్రయిస్తామని.. రెండో టవర్లో స్పేస్ ను పెద్ద పెద్ద ఆఫీసులకు లీజుకు ఇస్తామని కంపెనీ తెలిపింది. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2,500 కోట్ల మేర అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కాగా.. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్ కలిసి దేశవ్యాంగా పలు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులు చేపట్టనున్నాయి. ‘ట్రంప్ బ్రాండ్ ను భారత్ ఎంతో ఉత్సాహంగా స్వీకరించింది. ఎన్నో ఐకానిక్ ప్రాజెక్టులు చేపట్టిన ట్రంప్ ఆర్గనైజేషన్.. భారత్ లో తొలి కమర్షియల్ ప్రాజెక్టు ప్రారంభిస్తోందని సగర్వంగా తెలియజేస్తున్నాం’ అని ఈ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఎరిక్ ట్రంప్ పేర్కొన్నారు.