* నిర్మాణ రంగంలో నయా జోష్
* సింగిల్ విండోను పటిష్ఠం చేయాలి
* ఓఆర్ఆర్ బయట అపరిమిత ఎఫ్ఎస్ఐ వద్దు
* కృత్రిమంగా ధరల్ని పెంచొద్దు
* మధ్యతరగతి ఇళ్లపై దృష్టి పెట్టాలి
(కింగ్ జాన్సన్ కొయ్యడ)
రియల్ రంగానికి ఎంతో కీలకమైన పురపాలక శాఖ బాధ్యతల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వర్తించడాన్ని తెలంగాణ రాష్ట్ర డెవలపర్లు స్వాగతిస్తున్నారు. ఆయన స్వయంగా బిల్డర్ కావడంతో.. ఈ రంగం ఎదుర్కొనే వాస్తవిక సమస్యలు పక్కాగా తెలుసని అభిప్రాయపడ్డారు. అందుకే, రానున్న రోజుల్లో హైదరాబాద్ నిర్మాణ రంగం అభివృద్ధి చెందడానికి పటిష్ఠమైన నిర్ణయాల్ని సీఎం రేవంత్ తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పౌలోమీ ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ పూర్తి కాకముందే సీఎం రేవంత్ రెడ్డి కోకాపేట్‌లో విల్లా ప్రాజెక్టు కట్టిన విషయం తెలిసిందేనని తెలిపారు. కాబట్టి, ప్రస్తుతమున్న అభివృద్ధి భవిష్యత్తులోనూ కొనసాగుతుందన్నారు. జనప్రియ ఇంజినీర్స్ సిండికేట్ కె.రవీంద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ వంటిదని.. ఈ రంగం ద్వారా ప్రభుత్వ ఖజానాకు అధిక ఆదాయం లభిస్తుంది కాబట్టి.. రియల్ రంగాన్ని డెవలప్ అయ్యేలా నిర్ణయాలు తీసుకుంటారన్న నమ్మకం ఉందన్నారు.
ఇప్పుడైనా వీటిని చేయాలి..
సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటైనప్పటికీ కొన్ని శాఖలు పెద్దగా పట్టించుకోవట్లేదు. చెరువులు, కుంటల పక్కన అపార్టుమెంట్లను నిర్మించే క్రమంలో.. నీటిపారుదల శాఖ నుంచి పదిహేను రోజుల్లో క్లియరెన్స్ రావాలి. కానీ, అలా జరగడం లేదు. బిల్డర్లు స్వయంగా ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్వోసీ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఎయిర్ పోర్టు అథారిటీ, పర్యావరణ వంటి శాఖల నుంచి ఎన్వోసీకి ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి.
వీటినీ సింగిల్ విండో సిస్టమ్ పరిధిలోకి తేవాల్సిన అవసరముందని క్రెడాయ్ తెలంగాణ మాజీ ఛైర్మన్, ఆర్‌వీ నిర్మాణ్ ఎండీ రామచంద్రారెడ్డి కోరారు. టీఎస్ బీపాస్‌లో ముప్పయ్ రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే డీమ్డ్ పర్మిషన్ అని గతంలో చెప్పారు. కానీ, అలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు రుణాల్ని మంజూరు చేయట్లేదు. కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు డీపీఎంఎస్ విధానమే కొనసాగుతుంది. వాటినీ సింగిల్ విండో పరిధిలోకి తేవాల్సిన అవసరముందని ఆయన విన్నవించారు.
కృత్రిమంగా ధరల్ని పెంచొద్దు
హైదరాబాద్ రియల్ రంగానికి చెందిన కొందరు ప్రమోటర్లు కొత్త ప్రభుత్వానికి చేస్తున్న వినతి ఒక్కటే. గత ప్రభుత్వం తరహాలో కృత్రిమంగా భూములు, ప్లాట్ల ధరల్ని పెంచొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అలా చేయడం వల్లే గత మూడేళ్లలో హైదరాబాద్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు అందుబాటులో లేకుండా పోయాయని తెలిపారు. ఫలితంగా, మధ్యతరగతి ప్రజానీకం సొంతిల్లు కొనుక్కోలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి, కృత్రిమంగా ధరల్ని పెంచకుండా నిరోధించాలి. అదేవిధంగా, మధ్యతరగతికి అందుబాటులో ఇళ్లను డిజైన్ చేయాలని సూచిస్తున్నారు.
ఔటర్ బయట అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ వద్దు!
ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగంలో అపరిమిత ఎఫ్ఎస్ఐని పెట్టుకుంటే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ దీనిపై పరిమితి విధిస్తూ.. కొన్ని ప్రాంతాల్లోనే ఆకాశహర్మ్యాలకు అనుమతినిచ్చినా ఇబ్బంది లేదు. కాకపోతే, ఔటర్ రింగ్ రోడ్డు బయటి ప్రాంతంలో మాత్రం అన్‌లిమిటెడ్ ఎఫ్ఎస్ఐకి అనుమతించకూడదని పలువురు ప్రమోటర్లు కోరుతున్నారు. దీని వల్ల ఔటర్ బయటి ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు పెరిగిపోతున్నాయని అంటున్నారు.