అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రజలను నిరంతరం సంసిద్దం చేయవలసిన అవసరం ఉందని సి.ఎస్ తెలిపారు. గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అగ్ని ప్రమాదాలపై సీ.ఎస్ సమావేశం నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన పలు భద్రతా చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లు, సినిమా హాళ్లు మొదలైనవాటిని ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా అనే దానిపై జీహెచ్‌ఎంసీ విస్తృత తనిఖీలు నిర్వహించి, అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు నివాస సంక్షేమ సంఘాలను సంప్రదిస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని పురాతన భవనాలను గుర్తించి, అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసామన్నారు.
అన్ని షాపింగ్ కాంప్లెక్స్ లు, మల్టీప్లెక్స్ లు, ఆసుపత్రులు, ఇతర వాణిజ్య సంస్థలను సకాలంలో తనిఖీలు నిర్వహించి, వాటి ప్రాంగణాల్లో అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులను సి.ఎస్ ఆదేశించారు. రెసిడెన్షియల్ జోన్లలో పనిచేస్తున్న రెడ్ కేటగిరీ సంస్థలను గుర్తించి, వాటిని తరలించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సి.ఎస్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.