Categories: TOP STORIES

మూసీ ప్రక్షాళన చేసి తీరాల్సిందే

ఈ పరిస్థితి రావడానికి అభివృద్ధి
పేరుతో చేస్తున్న విధ్వంసమే కారణం
ఎక్కడి వ్యర్థాలను అక్కడే నిర్వహిస్తే..
ఎలాంటి సమస్యలూ ఉండవు
ప్రముఖ పర్యావరణవేత్త డా. లుబ్నా సార్వత్

 

హైదరాబాద్ లో కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్ గా మారిన మూసీ నదిని ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. లండన్ లోని థేమ్స్ నదీతీరంగా మూసీ తీరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరి ఇది సాధ్యమేనా.. మూసీని ప్రక్షాళన చేయడం కుదురుతుందా అని ప్రముఖ పర్యావరణవేత్త, ఎన్విరాన్ మెంట్ అండ్ వెల్ బీయింగ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ లుబ్నా సార్వత్ ను అడగ్గా.. ఆమె స్పందించారు. మూసా ప్రక్షాళన సాధ్యాసాధ్యాలను పక్కనపెడితే.. దానిని ప్రక్షాళన చేసి తీరాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలోనే పుట్టి, తెలంగాణలోనే ప్రవహించి, తెలంగాణలోనే ముగుస్తున్న మూసీని కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. అసలు మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తూ.. హైదరాబాద్ లో డెవలప్ మెంట్ పేరుతో చేస్తున్న విధ్వంసమే ఈ పరిస్థితికి కారణమని పేర్కొన్నారు. మూసీ నదికి ఉన్న బోలెడు ఇన్ లెట్స్ ద్వారా కలుషిత నీళ్లు కలుస్తాయని వివరించారు. హుస్సేన్ సాగర్ నుంచి మూసాపేట వరకు చాలాచోట్ల నుంచి వచ్చే వ్యర్థ జలాలు మూసీలో కలుస్తున్నాయని తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 650 చదరపు కిలోమీటర్లు ఉండగా.. హుస్సేన్ సాగర్ క్యాచ్ మెంట్ ఏరియానే 267 చదరపు కిలోమీటర్లు ఉందని వివరించారు. ఇలా నగరంలోని పలు చోట్ల నుంచి వ్యర్థాలు, కలుషిత నీళ్లు వివిధ ఇన్ లెట్ల ద్వారా మూసీలో కలుస్తున్నాయని చెప్పారు. హైటెక్ సిటీ నుంచి వచ్చే మురుగు నీరు కూడా మూసీలో కలుస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో మూసీని ప్రక్షాళన చేయడం కాదని.. దీనికి కారణం ఎక్కడ ఉందో తెలుసుకుని అక్కడ నియంత్రించాల‌ని లుబ్నా స్పష్టం చేశారు. వర్షపు నీటిని తీసుకెళ్లాల్సిన చానళ్లన్నీ మురుగు నీరు, వ్యర్థాలను తీసుకుని చెరువుల్లో కలుపుతున్నాయని.. అక్కడ నుంచి అవన్నీ మూసీలో చేరుతున్నాయని తెలిపారు. ఎక్కడ వస్తున్న వ్యర్థాలు, మురుగునీటిని అక్కడికక్కడ సమర్థంగా నిర్వహించడమే దీనికి ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తాము ఇప్పటికే పలు నివేదికలను ప్రభుత్వానికి ఇచ్చినట్టు చెప్పారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

This website uses cookies.