- జయ గ్రూప్, ఏజీఎస్ గ్రూప్, ఈఏపీఎల్ సంస్థలు
- కొల్లూరులో ప్రీలాంచ్లో ఫ్లాట్ల విక్రయం
- షోకాజ్ నోటీసును జారీ చేసిన రెరా
- స్పందించకపోవడంతో జరిమానా..
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కొరడా ఝళిపించింది. రెరా నిబంధనలకు విరుద్ధంగా అడ్వర్టయిజింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల్ని నిర్వహించినందుకు రూ.50 లక్షల జరిమానాను విధించింది. ఈ మేరకు టీఎస్ రెరా ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే.. జయా గ్రూప్, ఏజిఎస్ శ్రీనివాసం ప్రాపర్టీస్, ఈఏపీఎల్ సంస్థలు కలిసి హైదరాబాద్‌లోని కొల్లూరులో ప్రీలాంచ్ కార్యకలాపాల్ని నిర్వహించాయని టీఎస్ రెరా దృష్టికి వచ్చింది.
ఈ అంశంపై టీఎస్ రెరా అథారిటీ పూర్తి వివరాల్ని సేకరించింది. ప్రీలాంచ్ అమ్మకాలు జరిపిన విషయం వాస్తవమేనని గుర్తించింది. ఈ మేరకు మూడు సంస్థలకు షోకాజ్ నోటీసును జారీ చేసింది. అయినప్పటికీ ఈ కంపెనీల నుంచి ఎలాంటి సంజాయిషీ లేకపోవడంతో.. టీఎస్ రెరా సెక్షన్ 59 (1) ప్రకారం రూ.50 లక్షల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా టీఎస్ రెరా ఛైర్మన్ డా. ఎన్ సత్యానారాయణ మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థలు అపార్టుమెంట్లను విక్రయించే ముందు రెరా అనుమతిని తప్పకుండా తీసుకోవాలన్నారు. లేకపోతే చట్టం ప్రకారం తగిన చర్యల్ని తీసుకుంటామని హెచ్చరించారు.