2018 నుంచి ప్రీలాంచుల్లో కొని
ప్రజలు మోసపోతూనే ఉన్నారు..
నిర్మాణ సంస్థల మీద జరిమానా విధించలేదు
ముక్కుపిండి సొమ్మూ వసూలు చేయలేదు
ప్రీలాంచుల్ని అరికట్టడంలో పూర్తి విఫలం
రిటైర్డ్ ఉద్యోగులకు పునరావాస కేంద్రం!
టీఎస్ రెరా ఛైర్మన్ కాలక్షేపం చేస్తున్నారా?
రెరాలో కొత్త సిబ్బందిని నియమించాలి!
హెచ్ఎండీఏను ప్రక్షాళన చేయడంపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్ రెరా అథారిటీ మీద ప్రత్యేక నజర్ వేయాలి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులతో నిండిపోయిన టీఎస్ రెరా అథారిటీ.. రియల్ రంగంలో నెలకొన్న అక్రమాల్ని పరిష్కరించడంపై దృష్టి సారించట్లేదు. ఈ సంస్థ 2018లో మన రాష్ట్రంలో ఏర్పాటైనప్పట్నుంచి.. ప్రీలాంచ్‌లో ప్లాట్లు, ఫ్లాట్లు కొన్న నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం.. అక్రమ బిల్డర్ల చేతిలో మోసపోతున్నారు. అయినా, ఆయా సమస్యల పరిష్కారం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల్ని చెప్పుకోవడానికి వస్తే.. వారికే ఉల్టా జ్ఞానబోధ చేసి టీఎస్ రెరా ఛైర్మన్, అధికారులు వెనక్కి పంపిస్తున్నారని బాధితులు అంటున్నారు. అందుకే, సీఎం రేవంత్ రెడ్డి టీఎస్ రెరాను పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరపాలని కోరుతున్నారు.
2018లో టీఎస్ రెరా ఏర్పాటైనప్పట్నుంచి కొనుగోలుదారులు వివిధ సంస్థల వద్ద ప్రీలాంచుల్లో కొని మోసపోయారు. ఉదాహరణకు.. సాహితీ, జయా గ్రూప్, భునవతేజ, జీఎస్సార్ గ్రూప్, మైత్రీ ప్రాజెక్ట్స్, జేవీ ఎస్టేట్స్, పారిజాత డెవలపర్స్.. వంటి సంస్థల వద్ద ఫ్లాట్లు, ప్లాట్లలో పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయల్ని పోగొట్టుకున్నారు. ఆరేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైన టీఎస్ రెరా సంస్థ.. కాస్త ముందస్తుగా ఆలోచించి.. ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే.. ప్రీలాంచుల పట్ల కఠినంగా వ్యవహరించి ఉంటే.. ఇంత మంది బాధితులు హైదరాబాద్ రియాల్టీలో ఉండేవారు కాదు. కానీ, ఈ సంస్థ కేవలం కాలక్షేపం చేస్తూ.. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టలేదు. సోషల్ మీడియాలో ఏయే సంస్థలు ప్రీలాంచులు చేస్తున్నాయో పట్టించుకోలేదు.. వారికి నోటీసుల్ని ఇవ్వలేదు.. ఒకవేళ ఇచ్చినా, ఆయా కంపెనీలిచ్చే జవాబు ఎంతమేరకు కరెక్టో పక్కాగా నిర్థారించుకోవడంలో విఫలమైంది. అందుకే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినా, రెరా పనితీరులో మాత్రం మార్పు రాలేదు.
హైదరాబాద్ రియాల్టీలో క్రెడాయ్ హైదరాబాద్, నరెడ్కో తెలంగాణ, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ వంటి సంఘాలకు చెందిన పలువురు బిల్డర్లు నేటికీ ప్రీలాంచ్ వ్యాపారాన్ని మూడు పూవులు ఆరు కాయలుగా చేస్తున్నారు. అయినా, వారి మీద టీఎస్ రెరా ఎలాంటి చర్యల్ని తీసుకోవట్లేదు? ప్రీలాంచ్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసి చేతులు కాలిన తర్వాత టీఎస్ రెరాకు ఫిర్యాదు చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది? డబ్బు పోగొట్టుకుని రెరాకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం ఉండదు కదా! అందుకే, రియల్ సంస్థలు ప్రీలాంచులు చేస్తున్నప్పుడే నియంత్రించాలి. ఆయా కంపెనీల మీద జరిమానాను విధించాలి. అలాకాకుండా, ఎవరూ ఫిర్యాదు చేయలేదని.. రెరా ఆఫీసులో ఖాళీగా కూర్చుంటే ఎలా?
క్రెడాయ్ హైదరాబాద్ కు చెందిన కొన్ని సంస్థలు గుట్టుచప్పుడు కాకుండా ఫ్లాట్లను విక్రయిస్తున్నాయి. ఇందులో సైబర్‌సిటీ డెవలపర్స్ వంటి సంస్థ ఉండటం దురదృష్టకరం. ఇన్‌కార్ గ్రూప్ అయితే ఏకంగా ఫేస్‌బుక్‌లో ప్రకటనల్ని గుప్పించి ప్రీలాంచ్లో విల్లాల్ని అమ్ముతోంది. ఇక ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సంస్థకైతే హైదరాబాద్ ప్రీలాంచ్‌లకు అడ్డాగా చేసుకుంది. ఇలాంటివి అనేక కంపెనీలు హైదరాబాద్‌లో ప్రీలాంచ్ దందాలను చేస్తున్నా.. టీఎస్ రెరా నిద్రపోతుంది. ఏదో తూతుమంత్రంగా గతంలో 15 సంస్థల వరకూ నోటీసుల్ని ఇచ్చి రెరా చేతులు దులిపేసుకుంది. ఆతర్వాత ఆయా నోటీసులు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు.
ఇక బిల్డాక్స్ విషయంలో టీఎస్ రెరా పనితీరు పట్ల వ్యతిరేకత ఏర్పడింది. సుప్రీం కోర్టు వివాదంలో ఉన్న భూమిలో.. ప్రీలాంచుల పేరిట బిల్డాక్స్ సంస్థ కోట్ల రూపాయల్ని వసూలు చేసినా టీఎస్ రెరా పట్టించుకోలేదు. ఆయా ప్రీలాంచ్ అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేదు. టీఎస్ రెరా ప్రకటన వెలువడిన రోజే.. సోషల్ మీడియాలో బిల్డాక్స్ ప్రీలాంచ్ కొత్త ప్రకటనలు దర్శనమిచ్చాయి. అంటే, బిల్డాక్స్ సంస్థ టీఎస్ రెరాను ఎంత లైట్‌గా తీసుకుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి, ప్రీలాంచులు చేసే సంస్థలన్నీ టీఎస్ రెరాను ఏమాత్రం పట్టించుకోకపోతే.. ఆ సంస్థ ఉన్నా ఏం ప్రయోజనమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి, హెచ్ఎండీఏ తరహాలో టీఎస్ రెరాను సీఎం రేవంత్‌రెడ్డి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని ఔత్సాహిక ఇళ్ల కొనుగోలుదారులు కోరుతున్నారు.
This website uses cookies.