Categories: TOP STORIES

ప్రీలాంచ్ దందా.. చెరువు క‌బ్జా.. ప్రెస్టీజ్ సిటీపై చ‌ర్య‌ల్లేవా?

ప్రీలాంచ్ దందా చేసినా ప‌ట్టించుకోలేదు

అభివృద్ధి పేరుతో చెరువు కబ్జా..
అయినా క‌ళ్ల‌ప్పగించి చూశారు!

సుంద‌రీక‌ర‌ణ పేరుతో చెరువు కబ్డా..
అక్క‌డికి స్థానికుల‌కు నో ఎంట్రీ..

ఒక్క రోజులోనే అనుమతిలిచ్చిన అప్పటి
హెచ్‌ఎండిఏ డైరెక్టర్ శివబాలకృష్ణ

బాస్ ఒత్తిడితోనే అనుమతులు మంజూరు

(రెజ్ టాస్క్‌ఫోర్స్‌, హైద‌రాబాద్‌)

బాస్ చెప్పారు….నేను చేశాను…
బాస్ ఆదేశాల మేరకు ఒక్క రోజులోనే అనుమతులిచ్చాను.
ఇది హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ చెప్పే మాటలు.

ప్రీలాంచ్‌లో ఫ్లాట్ల‌ను విక్ర‌యించినా కేవ‌లం నోటీసులిచ్చి రెరా చేతులు దులిపేసుకుంది త‌ప్ప‌.. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్న దాఖ‌లాల్లేవు. ఈ సంస్థ యాజమాన్యం వెనుక ఉన్న కొందరు ప్రజా ప్రతినిధుల అండ ఉండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ వ‌ద్ద ఫ్లాట్లు కొన్న ప‌లువురు కొనుగోలుదారులు నేటికీ ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. తాజాగా ఈ సంస్థ చెరువును క‌బ్జా చేసుకుని నిర్మాణాలు చేప‌డుతున్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మ‌రి, దీనిపై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌ల్ని తీసుకుంటుందా? లేక చూసీచూడ‌న‌ట్లు వ‌దిలేస్తుందా?

బెంగ‌ళూరుకు చెందిన ప్రెస్టీజ్ సంస్థ‌.. గ‌గ‌న్‌ప‌హాడ్ వ‌ద్ద ది ప్రెస్టీజ్ సిటీ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. 81 నుంచి 89 సర్వే నెంబర్, గగన్‌పహాడ్ పెద్ద చెరువు, గగన్‌పహాడ్ టు ప్రేమావతిపేట మధ్యలో మల్గుడ్ చెరువు వద్ద ఈ నిర్మాణాన్ని ఆరంభించింది. అయితే ఈ కంపెనీ చేపట్టే నిర్మాణాలను ఆనుకొని.. 90 ఎకరాలకు పైచిలుకు విస్తీర్ణంలో మల్గుడ్ చెరువు ఉంది. హెచ్‌ఎండిఏ, డిటిసిపి లేఔట్‌లకు దగ్గరగా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎలాంటి చెరువులు, కుంటలు ఉండరాదన్న నిబంధన ఉంది. ఆ చెరువులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, దీని కోసం ప్రత్యేకంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల నుంచి ఎన్‌ఓసి తీసుకోవాలన్న నిబంధన ఉంది. అయినా ఈ నిబంధనలను తుంగలో తొక్కిన ది ప్రెస్టిజ్ సిటీ యాజమాన్యం.. ఈ లేఔట్ కోసం హెచ్‌ఎండిఏకు దరఖాస్తు చేసుకుంది. మొదట్లో దీనికి అనుమతులు ఇవ్వకూడ‌ద‌ని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయించారు. కానీ, అంతలోనే కొందరు ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. అనుమతులు వచ్చేలా చక్రం తిప్పినట్టు తెలిసింది. ఇందులో భాగంగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు భారీగా డబ్బులు ముట్ట చెప్పినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఈ చెరువు ఎఫ్‌టిఎల్, బఫర్‌జోన్‌లను పరిగణలోకి తీసుకోకుండా అప్పటి రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ప్రెస్టీజ్ సిటీకి ఎన్‌ఓసి ఇచ్చారని తెలుస్తోంది.

సుందరీకరణ పేరుతో చెరువు కబ్జా

ది ప్రెస్టిజ్ సిటీ అనుమ‌తి కోసం మల్గుడ్ చెరువును సుందరీకరిస్తామని చెప్పిన ప్రెస్టీజ్ యాజ‌మాన్యం.. ఆ చెరువును కూడా కబ్జా చేసి నిర్మాణాలను చేపడుతున్నట్టుగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. అప్పటి హెచ్‌ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అనుమతులపై సంతకం చేయడంతో పాటు ఈ చెరువు సుందరీకరణ అంశాన్ని కూడా ఆ ఫైల్‌లో చేర్చి దానికి అనుమతులు వచ్చేలా కృషి చేసినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఎవ‌రైనా ఈ చెరువు వ‌ద్ద‌కెళ్లాలంటే.. త‌ప్ప‌నిస‌రిగా ఈ సంస్థ అనుమతి తీసుకోవాల్సిందే. అంటే స్థానికులు సైతం చెరువు వ‌ద్ద‌కెళ్లాలంటే ఆయా కంపెనీ ద‌యాదాక్షీణ్యాల మీదే ఆధార‌ప‌డాల్సి ఉంటుందన్న‌మాట‌. కొంద‌రు ప్రజాప్రతినిధుల జోక్యం వ‌ల్లే దీనికి అనుమతులు త్వరగా లభించాయని, అందులో భాగంగానే ఒక్కో ప్లాట్‌ను కోటి పైచి లుకు విక్రయిస్తున్నారని, అలాగే ఒక్కో విల్లాకు రూ. 10 కోట్ల పైగా ధరకు ఈ సంస్థ అమ్ముతోంది. అయితే వచ్చిన లాభాన్ని ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సి రావడంతో.. ఇలా అధిక ధరకు ఈ విల్లాలను, ప్లాట్లను విక్రయిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. లేక‌పోతే, గ‌గ‌న‌ప‌హాడ్ వంటి ప్రాంతంలో అంతంత రేటు పెట్ట‌డ‌మేమిట‌ని బ‌య్య‌ర్లు సైతం విస్తుపోతున్నారు.

50 ఎకరాలు హాంఫ‌ట్‌?

మల్గుడ్ చెరువు మొత్తం 97 ఎకరాల 29 గుంటల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు సర్వే నెంబర్ 35 నుంచి 39 వరకు.. అదే విధంగా 42 నుంచి 48 వరకు.. దీంతోపాటు 335, 336 సర్వే నంబర్లలో రాజేంద్రనగర్ సర్కిల్ ప్రేమావతి డివిజన్ పరిధిలోని గగన్ పహాడ్ లో ఉంది. రికార్డులో 97 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ చెరువు క్షేత్ర స్థాయిలోకి వెళితే.. అది కనిపించడం లేదని స్థానికులు సైతం పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ చెరువు 40 ఎకరాలు కూడా లేదని దీనిపై రేవంత్ రెడ్డి స‌ర్కార్ వెంటనే స్పందించి.. త‌గు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

This website uses cookies.