ముంబైలో మరో భారీ డిల్
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో మరో భారీ రియల్ లావాదేవీ నమోదైంది. రెండు లగ్జరీ అపార్ట్ మెంట్లు రూ.198 కోట్ల ధర పలికాయి. ముంబై వర్లీలోని ఒబెరాయ్ 360 వెస్ట్ లో 13,809 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు లగ్జరీ ఫ్లాట్లను వైర్లు, కేబుల్స్ తయారీదారు ఆర్ఆర్ కాబెల్ లిమిటెడ్ ప్రమోటర్ శ్రీగోపాల్ కబ్రా, ఆయన కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. 62వ అంతస్తులో ఉన్న ఈ రెండు అపార్ట్ మెంట్లు.. చదరపు అడుగుకు రూ.1.43 లక్షల ధర పలికింది.
ఒప్పందంలో భాగంగా 10 కార్ పార్కింగ్ స్థలాలు కూడా వస్తాయి. గతనెల 29న జరిగిన ఈ లావాదేవీకి రూ.7.29 కోట్లు స్టాంపు డ్యూటీగా, రూ.60వేలు రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారు. రెండు అపార్ట్ మెంట్లలో ఒకటి 7,167 చదరపు అడుగుల విస్తీర్ణం, ఐదు కార్ పార్కింగ్‌లతో వస్తుంది. దీని ధర రూ.102.76 కోట్లు. ఇది రాజేష్ కబ్రా, మోనల్ కబ్రా పేరుతో రిజిస్టర్ అయింది. రెండో అపార్ట్ మెంట్ 6,642 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఐదు కార్ పార్కింగ్‌లతో వస్తుంది. దీని ధర రూ.95.40 కోట్లు. వీటిని కృతిదేవి కబ్రా, శ్రీగోపాల్ కబ్రా కొనుగోలు చేశారు.