2024 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాల్లో 20 శాతం పెరుగుదల
సరఫరాలోనూ 11.5 శాతం మేర వృద్ధి
దేశంలో రెసిడెన్షియల్ రియల్ మార్కెట్ జోరుగా దూసుకెళ్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో చక్కని పనితీరు కనబరిచింది. వార్షిక ప్రాతిపదికన 20.1 శాతం వృద్ధి నమోదైంది. అలాగే సరఫరా కూడా 11.5 శాతం పెరుగుదల కనిపించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇన్వెంటరీ స్థాయిలు రికార్డు స్థాయిలో 12 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయని జేఎం ఫైనాన్షియల్ నివేదిక వెల్లడించింది. స్థిరమైన డిమాండ్ ఉన్న గట్టి మార్కెట్ కు ఇది నిదర్శనమని పేర్కొంది. ధరల విషయానికి వస్తే.. వార్షిక ప్రాతికపదిన 9 శాతం మేర పెరుగుదల నమోదైనట్టు వివరించింది.
మొత్తమ్మీద 2024 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగం 29 శాతం మేర వృద్ధి కనబరించిందని తెలిపింది. టైర్-1 డెవలపర్ల ప్రాజెక్టుల అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 39.5 శాతం పెరిగాయి. హై ఎండ్ ఇళ్లు, బ్రాండెడ్ ప్రాజెక్టులకు పెరుగుతున్న ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని నివేదిక వ్యాఖ్యానించింది. దేశంలోని ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ మార్కెట్ పరంగా బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక ప్రాతిపదికన 18.1 శాతం పెరుగుదల నమోదైంది.
102.7 మిలియన్ చదరపు అడుగుల శోషణతోపాటు 95.9 మిలియన్ చదరపు అడుగుల కొత్త లాంచ్ లు నమోదయ్యాయి. ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాపర్టీల సరఫరాకు మించి డిమాండ్ ఉండటంతో అమ్ముడుపోని ఇన్వెంటరీలో 8.3 శాతం నమోదైంది. ప్రాపర్టీ ధరలు 2020-2024 మధ్య 10.7 శాతం మేర పెరిగాయి. ఢిల్లీలో రెసిడెన్షియల్ విభాగంలో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఇక్కడ శోషణ వార్షిక ప్రాతిపదికన 10.2 శాతం మేర తగ్గగా.. అమ్మకాలు మాత్రం 10.9 శాతం మేర పెరిగాయి. ముంబైలో ఇళ్ల అమ్మకాలు చక్కని పనితీరు కనబరిచాయి. వార్షిక ప్రాతిపదికన 20.4 మేర పెరుగుదల కనిపించింది. కొత్త లాంచింగ్స్ లో మాత్రం 3.5 శాతం తగ్గుదల నమోదైంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. రెసిడెన్షియల్ మార్కెట్ దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది.
ఇక్కడ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏకంగా 28 శాతం పెరిగాయి. ఒక్క నాలుగో త్రైమాసికంలో 20 శాతం పెరుగుదల కనిపించింది. సరఫరా కూడా గణనీయంగా పెరిగింది. చాలామందికి హైదరాబాద్ ఆకర్షణీయమైన నగరంగా ఉండటంతో ఇక్కడ రెసిడెన్షియల్ అమ్మకాల జోరు కొనసాగుతోంది. చెన్నైలో కాస్త విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కొత్త లాంచుల్లో 50 శాతం మేర పెరుగుదల ఉన్నప్పటికీ, అమ్మకాలు మాత్రం 9.5 శాతం మేర తగ్గాయి. ప్రాపర్టీ ధరలు 7.4 శాతం మేర పెరిగాయి.
This website uses cookies.