(కింగ్ జాన్సన్ కొయ్యడ, 9030034591)
హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ సినారియో చాలా బాగుందని సీబీఆర్ఈ హైదరాబాద్ హెడ్ గిప్సన్ పాల్ తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు సంబంధించిన పలు అంశాలపై ఆయన ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ గురుతో మాట్లాడారు. ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో 4.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అబ్జార్బ్ అయిందని వెల్లడించారు. ఇదే సమయంలో ఇది 3.4 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే ఉందని వివరించారు. అంటే.. ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అదనంగా అబ్జార్బ్ అయినట్టు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్ లో ప్రధానంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ లో ఐటీ కంపెనీలదే అగ్రస్థానమని పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, హైటెక్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు కూడా తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని.. ఈ నేపథ్యంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల హవా పెరుగుతోందని వివరించారు. ‘సాధారణంగా ఐటీ కంపెనీలన్న ఎక్కువగా అమెరికా, యూరోప్ కి చెంది ఉంటాయి. కొన్ని కంపెనీలు ఆసియావి ఉంటాయి. ఇవన్నీ తమ కార్యకలాపాలు భారత్ లో ఔట్ సోర్సింగ్ చేస్తుంటాయి. అందులోనూ హైదరాబాద్ ను ప్రధానంగా ఎంచుకోవడానికి కారణం ఇక్కడ జీవన వ్యయం తక్కువ.
టాలెంట్, మౌలిక వసతుల పరంగా ఇక్కడ బావుంటుంది. అమెరికా కంపెనీలు నిర్వహణ వ్యయం ఎక్కడ తక్కువగా ఉంటుందో చూస్తాయి. రియల్ ఎస్టేట్ ధర, ఎంప్లాయిమెంట్ ఖర్చు.. ఇలా ఎక్కడ తక్కువ ఖర్చు అవుతుందో పరిశీలిస్తాయి. దీనివల్ల వారికి పెద్ద మొత్తం సొమ్ము ఆదా అవుతుంది. అందువల్లే వారు ప్రధానంగా భారత్ ను ఎంచుకుంటున్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత బెంగళూరు, పుణె, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలను పరిశీలిస్తారు’ అని వివరించారు.
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) సాధారణంగా ఇక్కడ ఆఫీసు మొదలుపెడితే ఆటోమేటిగ్గా వినియోగం పెరుగుతుందని, ఒక జీసీసీ ఏది మొదలుపెడితే, మిగిలినవి దానినే అనుసరిస్తాయని పాల్ గిప్సన్ పేర్కొన్నారు. ‘సాధారణంగా క్లయింట్లు సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ సోషల్ కల్చర్ ఎలా ఉంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత? అన్నిటికంటే ముఖ్యంగా మనవ వనరుల లభ్యత సరిగా ఉందా లేదా అనేది చూస్తారు. హైదరాబాద్ లో అంతులేనంత టాలెంట్ ఉండటం బాగా కలిసొచ్చే అంశం. ఇవన్నీ హైదరాబాద్ ను అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయి.
అలాగే మన రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ప్రభుత్వాలకు రియల్ ఎస్టేట్ దృక్పథం చాలా బాగుంది. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఈ విషయంలో సానుకూలంగా ఉంటూ అభివృద్ధి చేస్తున్నాయి. దీంతో హైదరాబాద్ కు మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ అనగానే తర్వాత చూద్దాం. ముందు బెంగళూరులో పెడదాం లేదా ఢిల్లీ, గుర్గావ్ లో పెడదాం అనుకునేవారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. మరోవైపు జీసీసీలు రావడంతో రెసిడెన్షియల్ విభాగం కూడా విస్తరిస్తోంది. దీంతో సిటీ అభివృద్ధి చెందుతోంది’ అని వివరించారు.
సాధారణంగా ఐటీ కంపెనీలు ఒక్కో ఉద్యోగికి 75 లేదా 100 చదరపు అడుగులు తీసుకుంటాయని, 44 లక్షల చదరపు అడుగులు తీసుకుంటే.. 44 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం వచ్చినట్టేనని పాల్ పేర్కొన్నారు. ‘ప్రత్యక్ష ఉపాధితోపాటు పరోక్ష ఉపాధి కూడా లభిస్తుంది. ఇలా చూస్తే ఇంకా ఎక్కువ మందికే ఉద్యోగ, ఉపాధి లభిస్తుంది. పైగా హైదరాబాద్ పీస్ పుల్ సిటీ. జీవన వ్యయం కూడా తక్కువ. దేశంలోని ఏ నగరంలో పని చేసేవారైనా ఇక్కడకు వచ్చి ఉండటం సులభం. పైగా ఇక్కడ అందరూ హిందీ మాట్లాడటం చాలా పెద్ద సానుకూలమైన అంశం.
తొలుత ఇక్కడకు వచ్చిన తర్వాత వారికి కొంత సోషల్ సర్కిల్ విస్తరించే వరకు కాస్త అసౌకర్యంగా ఫీలవుతారు. తర్వాత హైదరాబాద్ ను తమ సొంత నగరంగా భావించి మమేకమైపోతారు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తారు. పైగా ఇక్కడ ధరలు కూడా అంత ఎక్కువేం కాదు. ఇదంతా రెసిడెన్షియల్ విభాగంపై సానుకూల దృక్పథం పెంపొందిస్తుంది. ఇవన్నీ రిటైల్, ఎంటర్ టైన్ మెంట్ వంటి ఇతర విభాగాలపై కూడా సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి’ అని పాల్ తెలిపారు.
హైదరాబాద్ లో ఆఫీస్ స్సేస్ సరఫరా కూడా చాలా బాగుందని గిప్సన్ పాల్ చెప్పారు. కొత్తగా 4.6 మిలియన్ చదరపు అడుగుల స్పేస్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. అయితే, డిమాండ్ కూడా అదే విధంగా పెరుగుతుండటంతో అద్దెలు కూడా పెరుగుతాయని వివరించారు. ‘హైదరాబాద్ లో ప్రైమరీ ఆఫీస్ స్పేస్ ఐటీ కారిడార్ అంటే.. మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిలోని కొన్ని ప్రాంతాలు. సెకండరీ మార్కెట్ అంటే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, పుప్పాలగూడ, నానక్ రాంగూడగా విభజించాం. మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. మెట్రో వంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో క్లయింట్లు తొలుత ఇక్కడే ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా ఇక్కడ అద్దెలు రూ. 80 నుంచి రూ. 85 మధ్యలో ఉన్నాయి.
పుప్పాలగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలకు వెళితే అద్దెలు రూ.50 చొప్పున ఉన్నాయి. రెండు మార్కెట్ల మధ్య మెట్రో ఒక్కడే తేడా. దీనివల్ల ప్రైమరీ మార్కెట్ వైపు వెళ్లడానికే క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్నారు. సెకండరీ మార్కెట్లో కూడా రవాణా వసతులు మెరుగుపడితే కచ్చితంగా అటువైపు కూడా అందరూ వెళ్లే అవకాశం ఉంది. మెట్రో కనెక్టివిటీ వస్తే కోకాపేట తదితర ప్రాంతాల్లో కచ్చితంగా ధరలు పెరుగుతాయి. అందువల్ల అది ఫ్యూచర్ మార్కెట్ కానుంది’ అని పేర్కొన్నారు.
20 సంవత్సరాల క్రితం మాదాపూర్ లో కూడా సరైన రవాణా వసతులు లేవని.. అక్కడ అన్ని వసతులూ వచ్చిన తర్వాతే బాగా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు.శంషాబాద్ తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పెరిగే కొద్దీ డిమాండ్ పెరుగుతుందని గిప్సన్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఇప్పుడే కాదని.. అక్కడ జరిగే అభివృద్ధిని బట్టి మూడు లేదా ఐదేళ్ల సమయం పడుతుందని పేర్కొన్నారు. శంషాబాద్ ఏరియాలో లాజిస్టిక్స్ మార్కెట్ నెమ్మదిగా పుంజుకుంటోందని తెలిపారు. లాజిస్టిక్స్ కు సంబంధించి మేడ్చల్ ప్రైమరీ మార్కెట్ అని, దాని తర్వాత శంషాబాద్ సెకండరీ మార్కెట్ గా అవతరిస్తోందని వివరించారు. 2025 నాటికి హైదరాబాద్ లో 35 నుంచి 40 శాతం స్పేస్ ను జీసీసీలు సొంతం చేసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
మిగిలిన స్పేస్ ను టెక్నాలజీ కంపెనీలు, ఫార్మా కంపెనీల వంటివి తీసుకుంటాయని వివరించారు.సీబీఆర్ఈ గురించి..ప్రపంచంలోనే అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ సర్వీసులు అందజేస్తున్న సంస్థే సీబీఆర్ఈ గ్రూప్. ఫార్చ్యూన్-500తోపాటు ఎస్అండ్ పీ-500 కంపెనీ అయిన సీబీఆర్ఈ ప్రధాన కార్యాలయం అమెరికాలోని డల్లాస్ లో ఉంది. దాదాపు 100 దేశాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్షా 30వేల మంద ఉద్యోగులు కలిగిన ఈ సంస్థ భారత దేశంలో తమ కార్యకలాపాలను 1994లో ఆరంభించింది. మనదే శంలోని 80 కి పైగా నగరాల్లో 15 కార్యాలయాల్లో 11వేల మంది కంటే ఎక్కువ మంది నిపుణులు పనిచేస్తున్నారు.
This website uses cookies.