హ్యాపీ హోమ్స్ అని వెళితే అన్ హ్యాపీనే

  • చదరపు అడుగు ధర రూ.2399 మాత్రమే అని ప్రకటన
  • నిర్మాణ వ్యయం కంటే తక్కువకు ఎలా ఇస్తారో అర్థం కాని వైనం
  • నమ్మి డబ్బులు కట్టారో.. బొక్కబోర్లా పడటం ఖాయం

‘‘హ్యాపీ హోమ్స్.. పదెకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు.. జీ ప్లస్ 9 అంతస్తులు.. మొత్తం 1160 ఫ్లాట్లు.. చదరపు అడుగు కేవలం రూ.2199 మాత్రమే.. 75 శాతం బ్యాంకు రుణం కూడా లభ్యం.. పైగా రూ.5 లక్షల విలువైన ఎమినిటీస్ పూర్తిగా ఉచితం..’’ – ఇదీ దేవాస్ ఇన్ ఫ్రా అనే బిల్డర్ అదిరిపోయే రేంజ్ లో ఇచ్చిన ప్రకటన. షామీర్ పేటలో ఈ ప్రాజెక్టు మొదలువుతోందని అందులో వివరించారు. ఎవరైనా ఇది నమ్మి, తక్కువ ఖర్చుతో సొంతింట్లో హ్యాపీగా ఉండొచ్చని డబ్బులు కట్టారో.. చివరకు మిగిలేది అన్ హ్యాపీనే. ఎలాగో ఓసారి చూద్దాం..

జీ ప్లస్ 9 అంతస్తులు కట్టాలంటే.. తక్కువలో తక్కువ ఎంత లేదన్నా చదరపు అడుగుకి రూ.2500 వరకు అవుతుంది. పైగా ఇప్పటికే ఓ వైపు సిమెంట్, స్టీల్ ధరలు గణనీయంగా పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో నిర్మాణ సామగ్రి ధరలు పది నుంచి 20 శాతం పెరిగిపోయి నిర్మాణ వ్యయం తడిసి మోపెడవుతోందని బిల్డర్లు గగ్గోలు పెడుతున్నారు. పెరిగిన నిర్మాణ వ్యయం కారణంగా ఫ్లాట్ల ధరలు కూడా పెంచక తప్పదని స్పష్టంచేస్తున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి వీటి ధరలు పెంచుతామని చెబుతున్నారు.

ఇలాంటి తరుణంలో ఈ బిల్డర్ మాత్రం చదరపు అడుగుకి రూ.2399కే ఫ్లాట్లను ఇస్తానంటూ మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు టోపీ పెడుతున్నాడు. ఆ మేరకు స్టీల్ వాడటం తగ్గించేస్తాడా? సిమెంటు బదులు ఇసుకతో కట్టేస్తాడా అనేది ఆయనకే తెలియాలి. ఎందుకంటే అతడు చేసేది వ్యాపారమే కానీ సంఘసేవ కాదు కదా? తాను పెట్టిన ఖర్చుకు పదింతలు సంపాదించాలనే తపనతోనే ఉంటాడు కానీ, పెట్టిన ఖర్చు కంటే తక్కువకు ఇద్దామని అనుకోడు కదా? ఇవన్నీ ఆలోచిస్తే ఇందులో అసలు కిటుకు ఏమిటో బోధపడుతుంది.

నిజానికి ఇలాంటి బిల్డర్లు చెప్పే మాటలు వింటే ఎవరైనా సరే వారి బుట్టలో పడటం ఖాయం. ఆ తర్వాత బొక్కబోర్లా పడటమూ ఖాయమే. ఎందుకంటే ఈ ఆఫర్ ధరలో ఫ్లాట్ కావాలంటే వందకు వంద శాతం పేమెంట్ కట్టేయాల్సిందే. ఆ తర్వాత సదరు బిల్డర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే.. అది పూర్తి కావడానికి కనీసం నాలుగైదేళ్లు పడుతుంది. అది కూడా అంతా సవ్యంగా సాగితేనే.. లేకుంటే ఆ ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో ఎవరికీ తెలియదు. సొమ్మంతా పోగేసుకుని పారిపోయినా చేసేదేమీ ఉండదు. ఇప్పటికే ఇలాంటివి ఎన్నో మోసాలు వెలుగుచూశాయి. ఎంతోమంది బాధితులు ఎంతో పెద్దమొత్తంలో సొమ్మును పోగొట్టుకున్నారు. చాలామంది బిల్డర్లు కటకటాలపాలయ్యారు.

అందువల్ల ఇలాంటి ఆఫర్ ధరల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే ముందు అన్నీ క్షుణ్నంగా తెలుసుకోండి. ఆ బిల్డర్ చరిత్ర ఏమిటి? అతడికి ఇంతకుముందు ప్రాజెక్టులు చేసి అనుభవం ఏమైనా ఉందా? అసలు ఈ ప్రాజెక్టుకు రెరా అనుమతి ఉందా లేదా వంటి విషయాలు ఆరా తీయండి. ఒకవేళ రెరా అనుమతి ఉంటే ఓకే. లేకుంటే మాత్రం ఆ ప్రాజెక్టుకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలా కొనుగోలుదారులకు టోపీ పెట్టడానికి, ఆఫర్ పేరుతో అందినకాడికి దండుకోవడానికి బోలెడు మంది కేటుగాళ్లూ పొంచే ఉంటారు. అలాంటివారి నుంచి జాగ్రత్తగా ఉండండి. మన కష్టార్జితం రాళ్లపాలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.

This website uses cookies.