అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇళ్ల అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే అక్టోబర్ గృహ విక్రయాలు 3.4 శాతం మేర పెరిగినట్టు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ వెల్లడించింది. గతేడాది అక్టోబర్ తో పోలిస్తే 2.9 శాతం మేర పెరిగినట్టు తెలిపింది. అలాగే ఇళ్ల ధరలు కూడా వరసగా 16వ నెల పెరిగినట్టు పేర్కొంది.
గతేడాదితో పోలిస్తే సగటు ఇంటి ధర 4 శాతం మేర పెరిగి 407200 డాలర్లకు చేరినట్టు చెప్పింది. అమెరికాలో ఇళ్ల అమ్మకాల్లో క్లిష్ట దశ ముగిసే సమయం ఆసన్నమైందని, ఇన్వెంటరీ, అమ్మకాలు పెరగడంతో మరిన్ని లావాదేవీలకు ఆస్కారం ఏర్పడిందని అసోసియేషన్ చీఫ్ ఎకనమిస్ట్ లారెన్స్ యున్ పేర్కొన్నారు. ఇంకా ఈ ఏడాది మరో 40 రోజులు ఉన్న నేపథ్యంలో మరిన్ని యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉందన్నారు.
కరోనా సమయంలో తక్కువగా ఉన్న వడ్డీ రేట్లు పెరగడంతో అమెరికాలో ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో కాస్త పెరుగుదల కనిపించడం ఆశాజనకంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.