Categories: TOP STORIES

పాజిటివ్ మోడ్‌.. షురూ..!

  • హైడ్రాతో రియ‌ల్ కుదేల్‌..
  • 4-5 నెల‌లు నో సేల్స్‌..
  • స్ప‌ష్ట‌త‌నిచ్చిన ప్ర‌భుత్వం
  • 2 వారాల్నుంచి సానుకూల‌త‌
  • ప్రాజెక్టుల్లో పెరిగిన సైట్ విజిట్స్‌

హమ్మ‌య్యా.. అంటూ రియ‌ల్ రంగం ఇప్పుడిప్పుడే ఊపిరి పిల్చుకుంటోంది. మార్కెట్లో మ‌ళ్లీ పాజిటివ్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది.. బ‌య్య‌ర్లు ఫ్లాట్ల‌ను కొనేందుకు సైట్ల‌కు వస్తున్నారు.. రేట్ల గురించి చ‌ర్చిస్తున్నారు.. ఎంత త‌గ్గిస్తారో క‌నుక్కుంటున్నారు.. ఫెస్టివ‌ల్ సీజ‌న్‌తో పోల్చితే గ‌త రెండు వారాల్నుంచి కాస్త క‌ద‌లిక‌లు ఏర్ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు బిల్డ‌ర్లు ప‌ది, ప‌దిహేను శాతం రేటును త‌గ్గించేందుకు అంగీక‌రిస్తున్నారు. గ‌త నాలుగైదు నెల‌ల్నుంచి ఎదుర్కొన్న మాన‌సిక ఒత్తిడి నుంచి బిల్డ‌ర్లు ఇప్పుడిప్పుడే బ‌య‌ట ప‌డుతున్నారు.

హైద‌రాబాద్ రియాల్టీ రంగంలో జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. హైడ్రా పేరిట దారుణ‌మైన విధ్వంసం జ‌రిగింది. ఇళ్ల అమ్మ‌కాలు దారుణంగా పడిపోయాయ్‌. నాలుగైదు నెల‌లు మాత్రం అధిక శాతం మంది బిల్డ‌ర్లు నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు. బ‌ఫ‌ర్ జోన్‌లో లేకున్నా.. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో లేకున్నా.. కొంద‌రు డెవ‌ల‌ప‌ర్లు మార్కెట్ గ‌మ‌నం చూసి నీర‌స‌ప‌డ్డారు. అస‌లిప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి వికృత ప‌రిస్థితులు హైద‌రాబాద్ రియాల్టీలో ఎన్న‌డూ ఏర్ప‌డ‌లేద‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు వాపోతున్నారు. హైడ్రాతో వికృత చేష్ఠ‌ల‌కు పాల్ప‌డిన ప్ర‌భుత్వం.. ఫ్యూచ‌ర్ సిటీ, ట్రిపుల్ ఆర్‌, మెట్రో సెకండ్ ఫేజ్ గురించి ఎంత చెబుతున్నా.. రియ‌ల్ బ‌య్య‌ర్ల‌లో ఆత్మ‌విశ్వాసం క‌రువైంది.

అందుకే, అధిక శాతం మంది అస‌లు ఇళ్ల కొనుగోళ్లపై దృష్టి పెట్ట‌లేదు. కాక‌పోతే, రాష్ట్ర ప్ర‌భుత్వం దిద్దుబాటు చ‌ర్య‌ల వ‌ల్ల‌.. గుడ్డి కంటే మెల్ల న‌యం అన్న చందంగా.. రియ‌ల్ మార్కెట్లో పాజిటివ్ వాతావ‌ర‌ణం నెలకొంటుంది. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మొద‌టి ఏడాది మార్కెట్ వేచి చూసే ధోర‌ణీలో ఉంటుంది. ఆ త‌ర్వాతే రియాల్టీ మార్కెట్లో అమ్మ‌కాలు పెరుగుతాయ‌ని న‌రెడ్కో జాతీయ అధ్య‌క్షుడు జి.హ‌రిబాబు రియ‌ల్ టాక్స్ విత్ కింగ్ జాన్స‌న్ అనే కార్య‌క్ర‌మంలో పేర్కొన్నారు.

2008లో స‌బ్‌ప్రైమ్ స‌మ‌స్య‌, స‌త్యం కుంభ‌కోణం, ప్ర‌త్యేక ఉద్య‌మం వంటి స‌మ‌యాల్లోనూ రియ‌ల్ రంగం ఇంత దారుణంగా దెబ్బ‌తిన‌లేదు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం పుణ్య‌మా అంటూ గ‌త ఏడాది నుంచి మార్కెట్ మొత్తం కుప్ప‌కూలింద‌ని చెప్పొచ్చు. ఆల‌స్యంగా క‌ళ్లు తెరుచుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం.. అనుమ‌తులు గ‌ల ప్రాజెక్టుల జోలికి హైడ్రా వెళ్ల‌ద‌నే ప్ర‌క‌ట‌న చేసింది.

కాక‌పోతే, అప్ప‌టికే జ‌ర‌గాల్సిన నష్టం జ‌రిగింది. ఇప్పుడు జాకీ పెట్టిన లేపినా రియ‌ల్ రంగం లేచే ప‌రిస్థితి క‌నిపించ‌ట్లేదు. కాక‌పోతే, అధిక శాతం బిల్డ‌ర్లు గ‌త రెండు వారాల్నుంచి న‌గ‌ర రియ‌ల్ మార్కెట్లో పాజిటివ్ వాతావ‌ర‌ణం ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ఇప్పుడిప్పుడే బ‌య్య‌ర్లు సైట్ విజిట్‌ల‌కు వ‌స్తున్నార‌ని.. కాక‌పోతే తుది నిర్ణ‌యం మాత్రం తీసుకోవ‌ట్లేద‌ని చెబుతున్నారు.

హైద‌రాబాద్‌లో రెడీ టు ఆక్యుపైతో పాటు ఏడాదిలోపు పూర్త‌య్యే ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కొంద‌రు బ‌య్య‌ర్లు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని ప‌లువురు డెవ‌ల‌ప‌ర్లు అంటున్నారు. ఇటీవ‌ల కోకాపేట్‌లో కొంద‌రు బిల్డ‌ర్లు ఆరంభించిన ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను బుక్ చేసుకున్నార‌ని తెలిసింది.

గోద్రెజ్‌, బ్రిగేడ్ వంటి కంపెనీల వ‌ద్ద‌ ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట కొంద‌రు బయ్య‌ర్లు కొనుగోలు చేశార‌ని స‌మాచారం. కొన్ని సంస్థ‌లు ఏం చేస్తున్నాయంటే.. నిర్మాణం తుదిద‌శ‌కు చేరుకున్న ప్రాజెక్టుల్లోనూ.. హండ్రెడ్ ప‌ర్సంట్ పేమెంట్ కింద ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. న‌గ‌దు కొర‌త స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకే కొన్ని ఫ్లాట్ల‌ను అమ్మేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

This website uses cookies.