- కోకాపేట్ వన్ గోల్డ్ మైల్‌లో..
- 1.68 లక్షల చ.అ. స్థలాన్ని సొంతం చేసుకున్న యూఎస్ సంస్థ
- అతిత్వరలో కార్యకలాపాలు ఆరంభం
ప్రపంచంలో ఆర్థిక మాంద్యంలో.. కొనసాగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్.. హైదరాబాద్లో అధికమైన ఆఫీసు స్పేస్ సరఫరా.. ఇలాంటి ప్రతికూల వాతావరణం ఏర్పడినా.. అత్యాధునిక డిజైన్ చేసిన ఆఫీసు సముదాయాలకు గిరాకీ తగ్గే ప్రసక్తే లేదని భాగ్యనగరంలోని పలు ఐటీ భవనాలు నిరూపిస్తున్నాయి. అందుకే, మాంద్యంతో సంబంధం లేకుండా.. అమెరికాకు చెందిన బడా కంపెనీలు.. హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. యూఎస్‌కు చెందిన మైక్రోచిప్ సంస్థ హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో గల వన్ గోల్డన్ మైల్ భవనంలో సుమారు 1.68 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సొంతం చేసుకుంది. దీనికి కుష్‌మన్ వేక్‌ఫీల్డ్ సంస్థ సలహాదారుగా వ్యవహరించింది. ‘‘సెమీ-కండక్టర్ పరిశ్రమలో ఆవిష్కరణలో హైదరాబాద్ ముందంజలో ఉంది. మైక్రో చిప్ సంస్థ కోకాపేట్‌లో 1.68 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని తీసుకోవడంతో.. సెమీ కండక్టర్ సంస్థలకు నగరం ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు పరుగులు పెడుతోంద’’ని కుష్‌మన్ అండ్ వేక్ ఫీల్డ్ హైదరాబాద్ ఎండీ వీరబాబు అభిప్రాయపడ్డారు.
కోకాపేట్ హాట్ లొకేషన్..
హైదరాబాద్లో కోకాపేట్ అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద దేశ, విదేశీ సంస్థలే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పొచ్చు. కోకాపేట్‌లోని వన్ గోల్డన్ మైల్ ప్రీమియం కమర్షియల్ ప్రాపర్టీని ఆరియన్, ఎస్కార్, టెర్మినస్ అనే సంస్థలు కలిసికట్టుగా అభివృద్ధి చేస్తున్నాయి. ఈ మొత్తం బిల్డింగ్ విస్తీర్ణం.. ఐదు లక్షల చదరపు అడుగులు. ఇందులో ఆఫీసులు, హై స్ట్రీట్ రిటైల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ భవనం ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి అమెరికాకు చెందిన గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (యూఎస్ జీబీసీ) నుంచి లీడ్ గోల్డ్ రేటింగ్ ప్రీ సర్టిఫికేషన్ లభించింది. ఈ భవనం డిజైన్, స్పెసిఫికేషన్లను గమనిస్తే అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన విషయాన్ని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుందని వన్ గోల్డన్ మైల్ మేనేజింగ్ పార్ట్‌నర్లు పుష్కిన్ రెడ్డి, రిత్విక్ మాలీలు తెలిపారు.