ప్రభుత్వానికి వెస్ట్ జోన్ బిల్డర్ల వినతి
వెస్ట్ జోన్ బిల్డర్లు ప్రభుత్వాన్ని పెద్ద పెద్ద కోరికలేం కోరడం లేదు. తమకు ఎకరాల కొద్దీ స్థలాన్ని తక్కువ ధరకు మంజూరు చేయమని అనట్లేదు. అడ్డగోలుగా అనుమతుల్ని మంజూరు చేయాలని ఒత్తిడి చేయట్లేదు. న్యాయ సమ్మతమైన కోరికను కోరుతున్నారు. గతేడాది నుంచి పురపాలక శాఖ అధికారుల్ని కలిశారు. వినతి పత్రాన్ని సమర్పించారు. అయినా పట్టించుకోవట్లేదు. కారణం.. వీరు చిన్న బిల్డర్లు కావడమేనా? అయినా తమకు వ్యక్తిగత లాభం చేకూర్చేలా నిర్ణయం తీసుకోమని అడగట్లేదు వీరు అడగటం లేదు కదా!
ఇటీవల మియాపూర్‌లోని ఒక హోటల్‌లో జరిగిన వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం, ప్రధాన కార్యదర్శి ఎం. ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో కొన్ని తీర్మానాల్ని ఆమోదించారు. హెచ్ఎండిఏ పరిధిలోని నాలా ఛార్జీలను హెచ్ఎండిఏ కార్యాలయంలోనే కట్టించుకోవాలని ప్రభుత్వాన్నికోరారు. చిన్న బిల్డర్ల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యల్ని పరిష్కరించాలని విన్నవించారు. హెచ్ఎండిఏ పరిధిలోని నిర్మాణ అనుమతులు ఇచ్చేటప్పుడు నాలా చార్జీలను హెచ్ఎండిఏ లోనే కట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
ఏమిటీ సమస్య?
పంచాయతీ లేఅవుట్లలో కొన్ని ప్లాట్లు తీసుకుని వెయ్యి నుంచి రెండు వేల గజాల్లో కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లను నిర్మించారు. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకునేటప్పుడే 5 శాతం తనఖా పెట్టిన తర్వాత కూడా మరో మూడు శాతం అదనంగా నాలా ఛార్జీల కోసం తనఖా పెట్టారు. ఈ నిర్మాణాలు పూర్తయ్యాక నాలా ఛార్జీలను కట్టేందుకు సాధ్యం కావట్లేదు. బిల్డర్లు ఈ రుసుమును కడతామని చెబుతున్నా అటు హెచ్ఎండీఏ కానీ ఇటు రెవెన్యూ శాఖ కానీ పట్టించుకోవట్లేదు. ధరణీలో ఆప్షన్ లేదని అంటున్నారు. దీని వల్ల ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరణిలో ప్లాట్లు అని రాసి ఉండటం వల్ల నాలా ఛార్జీల్ని కట్టించుకునే అవకాశం లేదని మరోవైపు అధికారులు చెబుతున్నారు. అందుకే, నాలా ఛార్జీలను హెచ్ఎండీఏ లోనే కట్టించుకోవాలని చిన్న బిల్డర్లు డిమాండ్ చేస్తున్నారు.
* టీఎస్ బీపాస్ లో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని.. దరఖాస్తు చేసేటప్పుడు చాలా సర్టిఫికెట్లను రిసీవ్ చేసుకోవట్లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి టీఎస్ బీపాస్‌లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చెన్నా రెడ్డి, అడ్వైజర్ నర్రా నాగేశ్వర్ రావు, ఉపాధక్షుడు కేవీ ప్రసాదరావు, బి. లక్ష్మీనారాయణ, కొర్రపాటి సుభాష్, నరేంద్ర ప్రసాద్, రామ్ కుమార్, రాజేంద్ర ప్రసాద్, ధీరజ్ కుమార్, లక్ష్మీపతి రాజు, తిలక్ కుమార్, నర్సింహా రెడ్డి తదితర బిల్డర్లు పాల్గొన్నారు.