- స్టాండర్డ్ అలాట్‌మెంట్ డాక్యుమెంట్‌కు రూపకల్పన
- బిల్డర్లు, బయ్యర్ల మధ్య వివాదాలు తగ్గుతాయ్
గృహ కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు మహారాష్ట్ర తరహాలో రెరా చట్టంలో స్టాండర్డ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ ను చేర్చింది. ఇదే దిశగా తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ చట్టం ప్రకారం బిల్డర్లు ప్రతి ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాలి. కొందరు బిల్డర్లు రెరాలో నమోదయ్యాక నిబంధనలను పట్టించుకోవట్లేదు. బిల్డర్లకు, వినియోగదారులకు మధ్య వివాదాలను రెరా ఎక్కువగా పట్టించుకోవట్లేదని బాధితులు అంటున్నారు. ప్రజలకు మేలు జరగాలంటే.. మహా రెరాను చూసి టీజీ రెరా నేర్చుకోవాలని ప్రజలు చెబుతున్నారు. ఇంతకీ మహా రెరా ఏం చేసిందంటే.. ప్రత్యేకంగా ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనను ప్రవేశపెట్టింది. నిర్మాణదారులతో బయ్యర్లకు ఏర్పడే వివాదాల్ని పరిష్కరించడంలో ఈ నిబంధన బాగా ఉపయోగపడుతోంది. గృహ అమ్మకాల్లో పారదర్శకత పెంచేందుకు, బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య వివాదాలను తగ్గించేందుకు ప్రామాణిక కేటాయింపు పత్రాలను మహా రెరా ప్రవేశపెట్టింది.
కొత్త నిబంధన ప్రకారం.. కొనుగోలుదారుడు ఎవరైనా బిల్డర్ వద్ద ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌజ్, విల్లా కొనుగోలు చేస్తే.. ఎప్పటిలోగా అందజేస్తారు? పార్కింగ్ కేటాయింపు ఎక్కడ? ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే ఎంత శాతం రుసుం చెల్లించాలి? వంటి కీలక వివరాలన్నీ ప్రామాణిక కేటాయింపు పత్రంలో బిల్డర్ పేర్కొనాలి. కొనుగోలుదారులు బుకింగ్‌లు రద్దు చేసుకునేటప్పుడు అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర రెరా ప్రామాణిక కేటాయింపు పత్రాన్ని ప్రవేశపెట్టింది. బిల్డర్ ఎవరైనా ప్రాజెక్ట్‌ను రెరాలో రిజిస్టర్ చేసే సమయంలోనే ఈ లేఖను పొందుపర్చాలి. వివరాలు అందజేయకపోతే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు, ప్రాజెక్ట్ వ్యయంలో 5 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనను తెలంగాణ రెరాలో పెట్టాలని నిపుణులు కోరుతున్నారు. అప్పుడే ఇళ్ల కొనుగోలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించవచ్చని అభిప్రాయపడుతున్నారు.