సూపర్ టెక్ సంస్థ నోయిడాలో అక్రమంగా నిర్మించిన జంట టవర్ల కథ ముగిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 28న మధ్యాహ్నం 2.30 గంటలకు నియంత్రిత పేలుడు పదార్థాలు వినియోగించి ట్విన్ టవర్స్ ను విజయవంతంగా కూల్చివేశారు. దాదాపు తొమ్మిదేళ్లుగా సాగిన ఈ పోరాటానికి కేవలం 12 సెకన్లలో తెర పడింది. చూస్తుండగానే పేక మేడలా రెండు భవనలూ నేలమట్టమయ్యాయి. ఈ కూల్చివేతకు సూపర్ టెక్ సంస్థ దాదాపు రూ.17.5 కోట్లు వెచ్చించింది. ఇక అసలు కథ ఇప్పుడే ప్రారంభం కానుంది. జంట భవనాల కూల్చివేతతో అక్కడ భారీగా శిథిలాలు కుప్పలా పేరుకుపోయాయి.
దాదాపు 80 వేల టన్నుల బరువున్న ఆ శిథిలాలను తరలించడానికి మూడు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ భవనాలను కూల్చిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థకే శిథిలాల తరలింపు బాధ్యత అప్పగించారు. దీంతో ఆ ప్రక్రియపై సంస్థ దృష్టి పెట్టింది. తొలుత శిథిలాలను తరలించడానికి వీలుగా పగలగొడతారు. అనంతరం పునర్వినియోగానికి వీలయ్యేలా రీసైక్లింగ్ చేస్తారు. వీటిని కొత్త ప్రాజెక్టుల్లో ఆయా ప్రమాణాల మేరకు వినియోగించే అవకాశం ఉంటుంది. అక్కడి శిథిలాలన్నింటినీ తొలగించడానికి కనీసం 90 రోజుల సమయం పడుతుందని ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది.
This website uses cookies.