రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడుల విషయానికి వస్తే క్రౌడ్ ఫండింగ్ అనేది ఇటీవల కాలంగా బాగా ప్రాచుర్యం పొందింది. క్రౌడ్ ఫండింగ్ సైట్ లు వెల్లువలా పుట్టుకొస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించడానికి వినూత్నమైన విధానాన్ని వాగ్దానం చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ లో మీ డబ్బును ఇతరులతో కలిసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడం వీలవుతుంది. పెద్ద ఆర్థిక నేపథ్యం లేకపోయినా.. గతంలో అందుబాటులో లేని పెట్టుబడి అవకాశాలను దీని ద్వారా పొందవచ్చు. సాధారణంగా ధనవంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గేమ్ లోకి కొత్త, అనుభవం కలిగిన సాధారణ పెట్టుబడిదారులు కూడా సులభంగా ప్రవేశించగలిగే అద్భుతమైన విధానమే ఈ క్రౌడ్ ఫండింగ్.
పెట్టుబడి పెట్టడంలో వినూత్నమైన ఈ మార్గం మీ పోర్టిఫోలియోను సైతం వైవిద్యంగా మారుస్తుంది. అదే సమయంలో భారీగా లాభాలనూ అందిస్తుంది. ఇతర రియల్ ఎస్టేట్ పెట్టుబడుల మాదిరిగా ఇది పూర్తిగా ప్రమాదరహితమని చెప్పలేం. కానీ సరైన ప్లాట్ ఫారమ్ ఉపయోగించి ప్రణాళికాబద్ధంగా ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశం ఉంది.
దశాబ్దం క్రితం వరకు రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ అనేది కేవలం ధనికులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫారమ్ మీ డబ్బును ఇతరులతో కలిసి పెట్టుబడి పెట్టడానికి వీలుచేస్తుంది. ఇది ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది అనుభవం కలిగిన పెట్టుబడిదారులు సైతం దీనివైపు మొగ్గు చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ అనేది ఎవరికైనా చిన్నమొత్తాల డబ్బుతో మొదలుపెట్టడానికి, పెద్దపెద్ద ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తుంది.
రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫారమ్ పెట్టుబడుదారులు, ఇతర పెట్టుబడిదారులు, ప్రాపర్టీ డెవలపర్లతో సంభాషించడానికి, కన్సల్టింగ్, మేనేజ్ మెంట్, అమ్మకాల కోసం ఫీజు సంపాదించే అవకాశం కూడా కల్పిస్తుంది
ఇది ఎలా పని చేస్తుంది?
ఉదాహరణకు హైదరాబాద్ ప్రైమ్ ఏరియాలో దాదాపు రూ.10 కోట్ల విలువైన వాణిజ్యపరమైన ఆస్తి ఉందనుకుందాం. ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ దానిని గుర్తించాడు. అయితే, అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఈ పరిస్థితుల్లో మార్కెట్ పరిశోధన, ఇతర అవసరాల ఆధారంగా కొంత మొత్తం వెచ్చించి ఆ ఆస్తిని వినియోగంలోకి తెస్తే దాని విలువ మరింత పెరుగుతుంది. అయితే, దానిని పునరుద్ధరించడానికి అవసరమైన నిధులు ఎలా తేవాలన్నదే ఇక్కడ సమస్య. ఈ పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నం చేయడం కంటే దీనిని రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ ప్రాస్పెక్టుగా మార్చవచ్చు. ఇందులో పెట్టుబడిదారులు లేదా వ్యక్తుల కన్సార్టియం పెట్టుబడి పెడుతుంది.
రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ వల్ల రెండు ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి.. రియల్ ఎస్టేట్ డెవలపర్ కు అవసరమైన నిధులు సమకూరడం. తద్వారా రుణం పొందే పాత సంప్రదాయ పద్ధతులకు ఇది ఆచరణీయమైన ప్రత్యమ్నాయంగా మారుతుంది. రెండో అంశం.. వ్యక్తులుగా కొనుగోలు చేయడం సాధ్యం కాని ప్రాపర్టీలో పెట్టుబడిదారులు వాటాదారులుగా మారడం. దీనివల్ల ఆయా పెట్టుబడిదారుల ఫోర్టఫోలియో విస్తృతమవుతుంది
ఇక రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ లో ఎంచుకున్న పెట్టుబడి వ్యూహాన్ని బట్టి మనకు వచ్చే లాభాలు మారుతూ ఉంటాయి. ఈక్విటీ ఆధారిత విధానంలో పెట్టుబడి పెడితే.. ఆస్తి యొక్క అద్దె రాబడి లేదా వారి యాజమాన్య శాతాన్ని బట్టి వచ్చే లాభాల ఆధారంగా రాబడి పొందుతారు. రుణం లేదా రుణం ఆధారిత విధానంలో సదరు ప్రాజెక్టుకు పెట్టుబడిదారులు డబ్బు అప్పుగా ఇచ్చినట్టు అవుతుంది. ఈ విధానంలో పెట్టుబడిదారులు ఆస్తి వాటాలను స్వీకరించరు. కానీ వారు పెట్టిన పెట్టుబడి, చెల్లించే వడ్డీ రేటు ఆధారంగా సెట్ రిటర్న్ పొందుతారు
భారతీయ పెట్టుబడిదారులకు లాభాలెలా?
రియల్ ఎస్టేట్ క్రౌడ్ ఫండింగ్ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల్లో పెట్టుబడి పెట్టే మొత్తం తగ్గడం అనేది ఒకటి. కొన్ని సందర్భాల్లో కేవలం రూ. 25 లక్షలు కూడా సరిపోతుంది. ఇంతకుముందు అయితే, ఈ పరిస్థితి ఉండేది కాదు. పైగా మీరు పెట్టుబడి పెట్టడానికి విస్తృత అవకాశాలుంటాయి. తద్వారా మీ రిస్కు శాతం భారీగా తగ్గుతుంది. ఉదాహరణకు.. మీరు రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాలనుకుంటే దేశవ్యాప్తంగా పది వేర్వేరు ప్రాజెక్టుల్లో ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. పైగా దీనివల్ల ఎలాంటి భూస్వామ్య సమస్యలూ ఉండవు.
ఇక రీట్ లతో క్రౌడ్ ఫండింగ్ ను పోల్చినప్పటికీ, వాస్తవానికి రెండింటికి మధ్య అనేక తేడాలున్నాయి. క్రౌడ్ ఫండింగ్ లో పైన పేర్కొన్న ప్రయోజనాలతోపాటు ఆస్తి ఎంపిక, ప్లేస్ మెంట్ పై తగిన నియంత్రణ ఉంటుంది. కానీ రీట్ లో ప్రాథమిక రకాల ఆస్తులు గురించి తెలిసినా.. వాటి గురించి పూర్తి అవగాహన ఉండదు. అదే క్రౌడ్ ఫండింగ్ లో మీరు పెట్టుబడి పెట్టాలనుకునే మార్కెట్లు, ప్రాపర్టీలను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. తరచుగా ప్రాపర్టీ అప్ డేట్లు కూడా పొందుతారు. కానీ రీట్ లో ఇది ఉండదు. పైగా క్రౌడ్ ఫండింగ్ లో విస్తృతమైన అవకాశాలు ఉంటాయి. తక్కువ రిస్కు ఒప్పందాలతో తక్కువ ఆదాయం.. ఎక్కువ రిస్కు ఒప్పందాలతో ఎక్కువ ఆదాయం పొందే వీలుంటుంది. దీంతో పెట్టబడిదారులు తమకు అనుకూలమైన ఒప్పందంలో పెట్టబడి పెట్టొచ్చు