ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేస్తోంది. మెట్రో రైలు పనులు ఎట్టకేలకు ఆరంభం అవుతున్నాయి. డిసెంబరు 9 న మెట్రో రైలుకు సీఎం కేసీఆర్.. అప్పా జంక్షన్లో శంకుస్థాపన చేస్తారు. మూడేళ్ల లోపు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుంది. రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం దాకా గల ౩1 కిలోమీటర్ల దూరాన్ని 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రాయదుర్గం, నార్సింగి, బైరాగిగూడ, కిస్మత్ పూర్, హరిగూడ, శంషాబాద్ నుంచి విమానాశ్రయం దాకా ఈ మెట్రో రైలును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది. ఇందులో జీఎంఆర్ సుమారు రూ.500 కోట్లు పెట్టుబడి పెడుతోంది. మరి, ఈ రైలు రావడం వల్ల ఎంతమందికి ఉపయోగ పడుతుంది? రియాల్టీ రంగానికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 దాకా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి.. సుమారు కోటీ ఇరవై లక్ష మంది ప్రయాణించారు. అంటే నెలకు పది లక్షల మంది చొప్పున.. ఇక్కడ్నుంచి రాకపోకలను సాగించారని చెప్పొచ్చు. సుమారుగా లెక్కిస్తే.. రోజు ౩౩ నుంచి 34 వేల మంది ప్రయాణీకులు శంషాబాద్ విమానాశ్రయానికి వెళతారన్నమాట. ఇందులో ఎంత మంది రాయదుర్గం నుంచి మెట్రో రైలు ఎక్కి ఎయిర్ పోర్టుకు వెళతారు? ఈ రైలు నిజంగా ఎవరికీ ఉపయోగపడుతుంది? రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మొదటి ఏడాది లక్ష మంది ప్రయాణీకులు రాకపోకలను సాగిస్తారని అంచనా వేస్తున్నారు. ఆతర్వాత నాలుగు లక్షల మందికి పెరుగుతుందని అంచనా. అంటే,
నెలకు సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది.. రోజుకి దాదాపు ౩౦౦ మంది ఈ రైలును ఉపయోగించే వీలుందన్నమాట.
వాస్తవానికి, రాజీవ్ గాంధి ఎయిర్ పోర్టుకు కేవలం హైదరాబాదే కాకుండా.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకులు విచ్చేస్తుంటారు. అంతెందుకు, పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన ప్రజలూ.. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశ,విదేశాలకు రాకపోకలను సాగిస్తుంటారు. వీరిలో ఎంతమంది రాయదుర్గం నుంచి శంషాబాద్ కు మెట్రో ద్వారా ప్రయాణిస్తారు? ఏ అంతర్జాతీయ నగరంలోని విమానాశ్రయం చూసినా.. మెట్రో రైలు కనెక్టివిటీ ఉంటుంది. ఆయా నగరం నలువైపుల నుంచి మెట్రో రైలును అనుసంధానం చేశారు. మన వద్ద కొన్నేళ్ల నుంచి మాట్లాడుకుంటున్నా.. ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించిన తొలి అడుగు పడుతోంది.
రాయదుర్గం నుంచి విమానాశ్రయానికి మెట్రో రైలు రావడం వల్ల.. నగరంలోని కేవలం ఒక వైపు నుంచి మాత్రమే విమానాశ్రయానికి కనెక్టివిటీ వస్తుంది. మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కేపీహెచ్బీ కాలనీ, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాలకు చెందినవారికి ఈ మెట్రో రైలు వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే, మియాపూర్లో మెట్రో రైలు ఎక్కి.. అమీర్ పేట్లో దిగి.. అక్కడ్నుంచి మరో మెట్రో ఎక్కి రాయదుర్గం వెళ్లి.. అటు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లాలంటే తలప్రాణం తోకకొస్తుంది. పైగా, లగేజీతో విమానాశ్రయానికి వెళ్లేవారు ఇంత ఇబ్బంది పడాలనుకోరు. అందుకే, వీరంతా క్యాబ్ లేదా బస్సును ఆశ్రయిస్తేనే.. ఎయిర్ పోర్టుకు సులభంగా చేరుకోవచ్చు. కాబట్టి, రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలును వేయడం వల్ల మాదాపూర్, గచ్చిబౌలి చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించేవారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతేతప్ప, పశ్చిమ హైదరాబాద్లోని ఇతర ప్రయాణీకులకు పెద్దగా ఉపయోగముండదు.
రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం ఏర్పడగానే రియల్ రంగంలో ఏదో అద్భుతం జరుగుతుందని భావించొద్దు. ఒక రవాణా సదుపాయం మాత్రమే అందుబాటులోకి వస్తుంది. సులువుగా రాకపోకలను సాగించే వీలు కలుగుతుంది. ఇక నుంచి అప్పా జంక్షన్, కిస్మత్ పూర్, నార్సింగి నుంచి రాయదుర్గం దాకా ఐటీ నిపుణులు సులభంగా రాకపోకల్ని సాగించొచ్చు. కార్లు, టూ వీలర్లను బయటికి తీయకుండా ఎంచక్కా మాదాపూర్ మైండ్ స్పేస్ వరకూ మెట్రోలో ప్రయాణం చేయవచ్చు. ఇదే అదనుగా భావించి.. కొందరు మధ్యవర్తులు స్థలాల ధరల్ని పెంచే ప్రమాదముంది. కాబట్టి, ఒకటికి రెండుసార్లు ఆలోచించి సొంతింటి విషయంలో తుది నిర్ణయానికి రండి.
This website uses cookies.