సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను శుక్రవారం ఆర్థిక నేరాల విభాగం, సీసీఎస్ పోలీసులు సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ఎండీ బూదాటీ లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. అమీన్‌పూర్‌లో 23 ఎకరాల్లో.. 38 అంతస్తుల సాహితీ శర్వాణీ ఎలైట్ అనే ప్రాజెక్టులో ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించారు. సొమ్ము తీసుకుని ఏళ్లు గడుస్తున్నా.. పనులు ఆరంభం కాలేదు. రేటు తక్కువ అంటూ.. అంతర్జాతీయ రీతిలో సదుపాయాలంటూ కొనుగోలుదారులను బుట్టలో వేయడంలో సాహితీ సంస్థ విజయం సాధించింది. రేటు తక్కువ కావడంతో అధిక శాతం మంది బయ్యర్లు వెనకా ముందు చూడకుండా ఫ్లాట్లను కొనుగోలు చేశారు. ఇలా, సుమారు 1700 మంది బాధితుల నుంచి దాదాపు రూ.539 కోట్లను వసూలు చేశారు. వసూలు చేసిన మొత్తం మీద 15 నుంచి 18 శాతం వడ్డీని చెల్లిస్తానని కొనుగోలుదారులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.
ఇదొక్కటే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 2500 మంది కొనుగోలుదారులను మోసం చేసి.. రూ.900 కోట్లును అక్రమంగా వసూలు చేశారు. దీంతో, పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రకటించే ప్రీలాంచ్ ఆఫర్లలో ఎట్టి పరిస్థితిలో సొమ్ము పెట్టకూడదని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయాలని సూచించారు.
బూదాటి లక్ష్మీనారాయణను పోలీసులు అరెస్టు చేశారు. మరి, బయ్యర్ల పరిస్థితి ఏమిటి? వీరికి రావాల్సిన సొమ్ము ఎలా వెనక్కి వస్తుంది? ఈ అంశంలో ప్రభుత్వం ఆలోచించి.. మధ్యతరగతి ప్రజల కష్టార్జితాన్ని వెనక్కి ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
This website uses cookies.