ప్లాట్లు అమ్ముకునే వరకూ అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. ఆతర్వాత పత్తా లేకుండా పోయిందో సంస్థ. లేఅవుట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని.. ప్లాట్లను విక్రయించిన మార్కెటింగ్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో ఏం చేయాలో ప్లాట్ల కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు.
హాల్‌మార్క్ హ్యాంప్టన్స్ సంస్థ శంషాబాద్ మండలంలోని గొల్లపల్లి కుర్ద్‌లో.. 23 ఎకరాల్లో ఏరో ఫామ్స్ అనే ఫామ్ హౌజ్ లేఅవుట్ వేసింది. మొదట్లో కొన్ని ప్లాట్లను విక్రయించిన తర్వాత.. ప్లాట్లను అమ్మే బాధ్యతను సిల్వర్ శాండ్స్ అనే సంస్థకు అప్పగించింది. దీంతో, లేఅవుట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తామని.. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సుమారు వంద ప్లాట్లను అమ్మేసింది. అయితే, ప్లాట్లను విక్రయించేటప్పుడు బయ్యర్లకు డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వృద్ధులకు ప్లేఏరియాలు, యోగా మరియు మెడిటేషన్ హాళ్లు వంటివి ఏర్పాటు చేస్తామని మాటిచ్చింది. వాటిని బ్రోచర్‌లో కూడా పొందుపరిచింది. అయితే ఏడేళ్లు గడిచినా ఇప్పటివరకూ పూర్తిగా డెవలప్ చేయనే చేయలేదు. అరకొరగా పనులు చేశారే తప్ప పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు.
వాస్తవానికి ఈ 23 ఎకరాల్లో ప్లాట్లు కొన్నవారికే క్లబ్ హౌజ్ సదుపాయాన్ని కల్పిస్తామని మొదట్లో మాటిచ్చి ఆ తర్వాత ప్లేటు ఫిరాయించాడు. దీని పక్కనే ఆనుకుని మరో కొత్త లేఅవుట్ వేసి.. అందులో ప్లాట్లు కొన్నవారికీ.. ఇదే క్లబ్‌హౌజ్‌ను చూపెడుతున్నాడు. అంతేకాదు, పక్కనే మరోవైపు గల ఇంకో ఫామ్ లేఅవుట్‌కూ క్లబ్ హౌజ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాడని సమాచారం. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఏరో ఫామ్స్ బయ్యర్లు.. హాల్‌మార్క్ గచ్చిబౌలి ఆఫీసులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తమకు కేటాయించిన క్లబ్‌హౌజ్‌లో ఇతరులకు ఎలా క్లబ్ హౌజ్ సదుపాయాన్ని కల్పిస్తారని నిలదీశారు.
దీంతో హాల్‌మార్క్ సంస్థ యాజమాన్యం సరైన సమాధానం లేకుండా దాటవేసిందని తెలిసింది. అమ్మేటప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. లేఅవుట్‌ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన బయ్యర్లు.. హాల్‌మార్క్‌కు నోటీసును కూడా ఇచ్చారు. అయితే, ఇవేవీ పట్టించుకోకుండా లేఅవుట్‌ను పూర్తి స్థాయిలో డెవలప్ చేయకుండా వదిలేశారని బయ్యర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా తమ ఏరో ఫామ్స్‌ను 23 ఎకరాల్లో డెవలప్ చేసి.. క్లబ్‌హౌజ్‌తో పాటు కామన్ ఎమినిటీస్‌ను అభివృద్ధి చేసి తమకు అందజేయాలని కోరుతున్నారు.