ఫెస్టివల్ సీజన్ వస్తే చాలు హైదరాబాద్ నిర్మాణ రంగంలో ఎక్కడ్లేని సందడి నెలకొంటుంది. వినాయక చవితి నుంచి ఆరంభమయ్యే ఇళ్ల అమ్మకాలు దసరా నుంచి ఊపందుకుంటాయి. ఈసారి రిజర్వ్ బ్యాంకూ రెపో రేట్లను పెంచలేదు. కాబట్టి, వాస్తవానికైతే మార్కెట్ మరింత సంతోషంగా ఉండాలి. కానీ, హైదరాబాద్ రియాల్టీ అందుకు భిన్నంగా ఉంది. అమ్మకాల సందడి లేదు.. ప్రాజెక్టు సందర్శనల కళకళ లేదు.. మార్కెట్ మొత్తం కళావిహీనంగా తయారైంది. అసలెప్పుడూ ఇలాంటి దుస్థితి మార్కెట్లో నెలకొనలేదని డెవలపర్లు అంటున్నారు.
ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలోనూ అమ్మకాలు ఆశించినంత స్థాయిలోనే జరిగాయని.. ఇప్పుడు మాత్రం మార్కెట్ మొత్తం ఢమాల్ అయ్యిందని.. మార్కెట్ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడినప్పట్నుంచి.. రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు కావాల్సిన పాలసీని ప్రకటించలేదు. ఈ రంగం మీద సీఎం రేవంత్ రెడ్డి పగబట్టాడేమోననే సందేహం ఏర్పడింది. మార్కెట్‌ను మొత్తం కుప్పకూల్చేసి.. ఆతర్వాత తీరిగ్గా అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారో తెలియదు కానీ.. నిన్నటివరకూ కళకళలాడిన హైదరాబాద్ రియాల్టీ.. ప్రస్తుతం కళావిహీనంగా మారింది. దేశంలోనే టాప్ సిటీగా అవతరించిన భాగ్యనగరం కనీసం టాప్ టెన్ రేసులో లేకుండా పోయింది. ప్రస్తుతం తెలంగాణ రియాల్టీ కేవలం ఒకే ఒక్క గేరులో పని చేస్తోంది. మరి, సెకండ్ గేరు, తర్వాత మూడు, నాలుగు తర్వాత టాప్ గేరులోకి ఎప్పుడు వెళుతుందా అంటూ నిర్మాణ రంగం ఎదురుచూస్తోంది.
బ్రేకుల మీద బ్రేకులు వేసుకుంటూ పోతే.. బండి పాడైపోతుందనే విషయం తెలిసిందే. మరి, టాప్ గేర్‌లోకి వెళ్లేందుకు హైదరాబాద్ రియాల్టీకి అన్ని అర్హతలున్నా.. రథసారధితోనే సమస్య అని ప్రజలూ భావిస్తున్నారు. మరి, రథసారధి ఇప్పటికైనా రియాల్టీని టాప్‌గేరులోకి తీసుకెళ్లాలని అటు బయ్యర్లు ఇటు బిల్డర్లు కోరుతున్నారు.