శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ మహా నగరం విస్తరణకు రంగం సిద్దమైంది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ మేరకు హెచ్ఎండీఏ రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ 2050 తుది దశకు చేరుకుంది. రానున్న పాతికేళ్ల అవసరాలకు తగ్గట్టుగా 2050-మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తోందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా మహా నగరాన్ని ఫ్యూచర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎంఓ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో హైదరాబాద్ అభివృద్ధికి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తొలగించేందుకు రూ.2,232 కోట్లతో రాజీవ్ రహదారిపై ఎలివేటెడ్ కారిడార్, రూ.1,580 కోట్లతో నాగ్‌పుర్ జాతీయ రహదారిపై డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. మెహిదీపట్నం వద్ద స్కైవాక్ నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతి తెప్పించడం పెద్ద విజయంగా పేర్కొంది సీఎం కార్యాలయం.
నూతన మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొత్తగా నిర్మించబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి భారీగా పెరగనున్నది. అయితే హెచ్ఎండీఏ కొత్త మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే 111 జీవో ప్రాంతం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసిన మాస్టర్ ప్లాన్ 2030 లో భారీగా మార్పులు చేర్పులు చేసి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050 రెడీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాలను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో విలీనం చేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. మాస్టర్ ప్లాన్ విస్తరణలో భాగంగా మార్పులు చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది.
గ్రేటర్ బల్దియా పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిని పెంచేలా మాస్టర్ ప్లాన్ 2050ని మరింత విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపల నిర్మాణం జరుపుకోనున్న రీజినల్ రింగ్ రోడ్డు వరకూ హెచ్ఎండీఏ విస్తీర్ణం పెరిగేలా మాస్టర్ ప్లాన్ సిద్దమవుతున్నట్లు అధికారిక వర్గాల సమాచారం.
హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అధారిటీ పరిధి ప్రస్తుతం 7,285 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ లో భాగంగా రీజినల్ రింగ్ రోడ్ వరకూ పొడిగిస్తే మరో 5 వేల చదరపు కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ 2050 ని రూపొందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో హెచ్ఎండీఏ పరిధి కొనసాగుతోంది. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధిని పొడిగిస్తే మరో రెండు లేదా మూడు జిల్లాలు హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయ్యే లోగా హెచ్ఎండీఏ పరిధిని పెంచే ప్రక్రియ కూడా పూర్తి చేయాలని, అందులో భాగంగా మాస్టర్ ప్లాన్ లో భారీ మార్పులు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ఉన్న మాస్టర్ ప్లాన్ 2030 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించగా ట్రిపుల్ ఆర్ వరకు రూపొందించే మాస్టర్ ప్లాన్ ను 2050 సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తోంది తెలంగాణ సర్కార్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ తో తెలంగాణ రూపురేఖలే మారిపోనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకూ ఉన్న ప్రాంతాలన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చి రెండు రింగ్ రోడ్లను అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్లను నిర్మించాలన్నది ప్రభుత్వ ప్రతిపాదనగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలన్నది రేవంత్ సర్కార్ లక్ష్యంగా తెలుస్తోంది. ఓఆర్ఆర్ లోపల అర్బన్ క్లస్టర్, ఓఆర్ఆర్ తర్వాత ట్రిపుల్ఆర్ కు సెమీ అర్బన్ క్లస్టర్, దాని అవతలి ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్ గా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు అధికారులు.
ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రీజినల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏను విస్తరించిన తర్వాత దానికి తగ్గట్టు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోంది ప్రభుత్వం. ఇందు కోసం అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను నియమించుకుని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని, శాస్త్రీయ పద్దతిలో మాస్టర్ ప్లాన్ కు తుది మెరుగులు దిద్దుతోంది రేవంత్ సర్కార్.
ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఐదు మాస్టర్ ప్లాన్లు హుడా, హడా, సీడీఏ, జీహెచ్ఎంసీ, ఎక్స్టెండెడ్ ఏరియా మాస్టర్ ప్లాన్లలో మరిన్ని మార్పులు చేసేందుకు హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. వీటన్నింటినీ రద్దుచేసి ట్రిపుల్ ఆర్ వరకూ మెగా హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్-2050 రూపొందిస్తంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను, ప్రత్యేక కార్యాచరణను హెచ్ఎండీఏ పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా ఈ మెగా మాస్టర్ ప్లాన్ ను ఆయా ప్రాంతాలను బట్టి వివిధ కేటగిరీల కింద మార్పు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా హెచ్ఎండీఏ పరిధిలో వివిధ జోన్లను ఏర్పాటు చేయనున్నారు.
2050 నాటికి ఆయా ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నదానిపై మాస్టర్ ప్లాన్లో రూపొందించబోతున్నారు. ఇందులో ముఖ్యంగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఐటీ, గ్రీనరీ, ఎంటర్టెయిన్మెంట్, అగ్రికల్చర్ జోన్, కన్జర్వేషన్, రీక్రియేషన్, స్పోర్ట్స్ జోన్స్.. ఇలాంటి వివిధ రకాల అవసరాలకు తగ్గట్టుగా జోన్లను విభజించి మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ప్రణాళికలు సిద్దం చేశారు.
హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050 లో 111 జీవో పరిధిలోని ప్రాంతంపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదంటున్నారు అధికారులు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవో పరిధిలోని ప్రాంత అభివృద్దిపై ఎటువంటి విధానం ప్రకటించలేదు. దీంతో 111 జీవో పరిధిలోని ప్రాంతం ఇప్పుడు హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ 2050 లోకి రానుండగా.. అక్కడ నిర్మాణాలు, అభివృద్దిపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. 111 జీవో పరిధిలోని సుమారు 1.30 లక్షల ఎకరాలు భూముల విషయంలో రేవంత్ సర్కార్ తీసుకునే నిర్ణయం మేరకు అక్కడ అభివృద్దికి, నిర్మాణరంగ విస్తరణకు అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
This website uses cookies.