-
111 జీవో అక్రమ నిర్మాణాలపై
కఠిన చర్యలెప్పుడు?
-
చూసీచూడనట్టు ఉండేందుకు
ఫ్లాట్లను ఎరవేసిందెవరు?
ఎన్నికల సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి.. ట్రిపుల్ వన్ జీవోపై అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. పర్యావరణాన్ని కాపాడాలని.. జంట జలాశయాల్ని పరిరక్షించాలని ఎలుగెత్తి చాటారు. గత ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేయడం పట్ల ఆయన తీవ్రంగా విమర్శించారు. 111 జీవో రద్దు అణుబాంబు విస్పోటం వంటిదని అప్పట్లో దుయ్యబట్టారు. మరి, రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో.. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో వెలిసిన అక్రమ నిర్మాణాల్ని పూర్తిగా ధ్వంసం చేయాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
2023 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని అనేక మంది బిల్డర్లు, డెవలపర్లు ట్రిపుల్ వన్ జీవోలోని పలు ప్రాంతాల్లో బడా సైజు విల్లాల్ని అభివృద్ధి చేశారు. కొందరైతే అపార్టుమెంట్లను ఆరంభించారు. ఇంకొందరేమో ఏకంగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లను నిర్మించారు. జంట జలాశయాలకు చేరువలోనే అనేక విల్లా కమ్యూనిటీలను డెవలప్ చేశారు. మరి, ఇప్పటికే డెవలప్ చేసినవాటితో పాటు కొత్తగా నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నేలమట్టం చేయాలని పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. కేటీఆర్ ఫామ్‌హౌజ్ మీద గతంలో అనేక విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. దానిపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం మార్కెట్లో సర్వత్రా చర్చనీయాంశమైంది.