- రెరా అనుమతి లేకుండానే ప్రకటనలు, విక్రయాలు
- స్వస్తిక హోమ్స్, శ్రీ వారాహి కన్ స్ట్రక్షన్స్ కంపెనీలపై ఆరోపణలు?
హైదరాబాద్‌లో గత ప్రభుత్వ హయంలో సర్వసాధారణంగా మారిన ప్రీలాంచుల వ్యవహారం.. ఇప్పుడు చిన్న పట్టణాలకు సైతం పాకింది. తాజాగా, జడ్చర్లలో రెరా అనుమతులు లేకుండా కొన్ని ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయనే ఫిర్యాదులు వస్తున్నాయి.
ముఖ్యంగా స్వస్తిక హోమ్స్, శ్రీ వారాహి కన్ స్ట్రక్షన్స్ కంపెనీలు.. డీటీసీపీ అనుమతి, రెరా అనుమతి లేకుండానే ప్రాజెక్టులు ప్రారంభించి విక్రయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో ఇప్పటికే పలువురు కొనుగోలుదారుల నుంచి దాదాపు రూ.10 కోట్ల వరకు తీసుకున్నట్టు సమాచారం. పైగా ఈ రెండు కంపెనీలు ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులూ లేకుండా.. ఫేజ్-2, ఫేజ్-3 డెవలప్ మెంట్ కూడా చేపట్టినట్టు చెబుతున్నారు. రెరా అనుమతులు లేని ఈ ప్రాజెక్టుల్లో ఎవరైనా ఫ్లాట్లు కొనుగోలు చేస్తే నష్టపోక తప్పదని.. ఇది మరో సాహితీ ఇన్ ఫ్రా కావడం తథ్యమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి అక్రమ ప్రాజెక్టులపై అధికారులు తగిన చర్యలు తీసుకుని అమాయక కొనుగోలుదారులను కాపాడాలని కోరుతున్నారు.