* ప్రాజెక్టు ఎత్తు గురించి అభ్యంతరమా?
* సివిల్ ఏవియేషన్ ఎన్వోసీ తీసుకోలేదా?
* ప్రాజెక్టు నిలిచిపోవడానికి కారణాలేమిటి?
* బయ్యర్లకు అర్బన్ రైజ్ తెలియజేయాలి
(రెజ్ న్యూస్ టాస్క్‌ఫోర్స్)
హైదరాబాద్‌లో ప్రీలాంచులంటే ముందుగా గుర్తుకొచ్చేది అర్బన్ రైజ్ సంస్థే. ఈ కంపెనీ తొలుత బాచుపల్లిలో.. ఆ తర్వాత అమీన్‌పూర్, గండిమైసమ్మ వంటి ప్రాంతాల్లో మూడు హైరైజ్ ప్రాజెక్టుల్ని ఆరంభించింది. ఛానెల్ పార్ట్‌నర్లు, రియాల్టీ ఏజెంట్లకు అధిక కమిషన్లు ముట్టచెప్పి.. బయ్యర్ల నుంచి వంద శాతం సొమ్మును వసూలు చేసిందీ సంస్థ. అంటే మొదట్లో.. స్థానిక సంస్థలతో బాటు రెరా నుంచి అనుమతి తీసుకోకుండానే ఫ్లాట్లను విక్రయించిందన్నమాట. ఈ క్రమంలో దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పక్కనే గండిమైసమ్మలో.. హ్యాపెనింగ్ హైట్స్ అనే ప్రాజెక్టును ఆరంభించింది. తర్వాత రెరా (P02200003508) అనుమతి తీసుకుంది.
ఆరంభం నుంచి నిర్మాణ పనుల్ని శరవేగంగా జరిపించిందీ సంస్థ. ఆ వేగాన్ని చూస్తే 2025 జూన్ లోపు కొనుగోలుదారులకు అందజేస్తుందనే నమ్మకం అందరికీ ఏర్పడింది. 4.82 ఎకరాల్లో.. ఐదు టవర్లలో 19 అంతస్తుల ఎత్తులో.. దాదాపు 853 ఫ్లాట్లలో అధిక శాతం కొన్నవారంతా ఆనందంగా ఉండటం విశేషం. మరో పద్దెనిమిది నెలలు గడిస్తే ఎంచక్కా గృహప్రవేశం కూడా చేసేయవచ్చని చాలామంది భావిస్తున్న తరుణంలో.. ఓ పిడిగులాంటి వార్త ప్రతిఒక్కర్ని కలవరపెడుతోంది. గత కొద్ది రోజులుగా హ్యాపెనింగ్ హైట్స్ నిర్మాణ పనులు నిలిచిపోవడమే ఇందుకు కారణం. ఇదే విషయాన్ని కొంతమంది రెజ్ న్యూస్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టును రెజ్ న్యూస్ ప్రతినిధి సందర్శించగా.. అక్కడి పరిస్థితిని చూసి ఒక్కసారిగా విస్తుపోయారు.
* సాధారణంగా.. ఆదివారం అంటే ప్రతి ప్రాజెక్టులో సందడి నెలకొంటుంది. ప్రధానంగా వేగంగా నిర్మాణ పనుల్ని జరిపే ప్రాజెక్టులో మరింత హడావిడి నెలకొంటుంది. కొత్త బయ్యర్ల సందడి, పాత కొనుగోలుదారుల సందర్శనతో సందడి సందడిగా కనిపిస్తుంది. ఇదివరకే కొన్నవారు తమ ప్రాజెక్టు ఏ స్థాయికి చేరుకుందో చూసేందుకూ విచ్చేస్తుంటారు. తమ బంధుమిత్రులను తీసుకుని వచ్చి తమ కలల గృహాన్ని చూపిస్తుంటారు. కానీ, ఇందుకు భిన్నమైన వాతావరణం గండిమైసమ్మ చేరువలోని హ్యాపెనింగ్ హైట్స్‌లో ఆదివారం సాయంత్రం కనిపించింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. నిర్మాణ సిబ్బంది కానీ క్రేన్ల హడావిడి కానీ ఎక్కడా కనిపించలేదు. ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులెవ్వరూ అక్కడి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.