- మరింత స్పష్టత రావాలి
ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేశామని రాష్ట్ర మంత్రిమండలి అంటున్నది. కానీ, ఇది సుప్రీం కోర్టు మరియు ఎన్జీటీ పరిధిలోని అంశం కాబట్టి.. రద్దయ్యే అవకాశం ఉంటుందా? అనే సందేహం ప్రతిఒక్కర్ని పట్టి పీడిస్తోంది. ఇందుకు సంబంధించిన కేసు రాష్ట్ర హై కోర్టు పరిధిలో కూడా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో అసలు ట్రిపుల్ వన్ జీవో రద్దు అవుతుందా? లేదా? అనే చర్చ జోరుగా జరగుతోంది. ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాల్లోని పలువురు వ్యక్తులను రెజ్ న్యూస్ సంప్రదించగా.. వారు అదే సందేహాన్ని వ్యక్తం చేశారు. 2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అయినా ఒక్క అడుగు ముందు పడలేదని.. ఈసారి మళ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి.. హడావిడిగా ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేశారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అంతెందుకు, రియల్ ఎస్టేట్ నిపుణులు, విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు.
ఒకవేళ ట్రిపుల్ వన్ జీవో అమల్లోకి వస్తే.. అక్కడ హెచ్ఎండీఏ నిబంధనల్ని అమల్లోకి తెస్తే.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ మురికికూపం తయారవుతాయని నిర్మాణ నిపుణులు అంటున్నారు. ఒకవేళ వర్షాలు పడితే వికారాబాద్, చేవేళ్ల నుంచి వచ్చే వరద ఇక్కడి ఇళ్లల్లోకి ప్రవేశిస్తుంది. అంటే, ముంబై తరహాలో వర్షాలు పడ్డ ప్రతీసారి ఇళ్లల్లోకి నీరొచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే, హెచ్ఎండీఏ నిబంధనల్ని అమల్లోకి తెస్తామని అంటున్నారు.. అంటే, ఆయా ప్రాంతాలన్నీ కాంక్రీటు జంగిల్లా మారిపోయే ప్రమాదముందని.. ఫలితంగా ఇళ్లన్నీ మునిగిపోయే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏదీఏమైనా, 111 జీవో ఏరియాను ఎలా అభివృద్ధి చేస్తారనే అంశంపై మరింత స్పష్టత రావాలని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ట్రిపుల్ వన్ జీవో అమల్లోకి వచ్చి.. హెచ్ఎండీఏ నిబంధనల్ని అమల్లోకి తెస్తే.. అనధికారికంగా అపార్టుమెంట్లు, విల్లాల్ని కట్టేవారు.. ఇక నుంచి అధికారికంగా నిర్మాణాల్ని చేపడతారు. కాకపోతే, వర్షాలు పడ్డ ప్రతీసారి అవి మునిగిపోతాయని నిపుణులు అంటున్నారు.