కింగ్ జాన్సన్ కొయ్యడ: ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తారా? లేదా? అనే అంశాన్ని పక్కన పెడితే.. సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన ప్రకటన నిర్మాణ రంగంలో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. ప్రధానంగా నార్సింగి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొల్లూరు, తెల్లాపూర్, ఉస్మాన్ నగర్, పాటి ఘనపూర్, వెలిమల వంటి ప్రాంతాల్లో అధిక సొమ్ము వెచ్చించి.. భూముల్ని కొనుగోలు చేసిన డెవలపర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. స్థల యజమానులతో అధిక నిష్పత్తికి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న బిల్డర్లకు ముచ్చెమటలు పడుతున్నాయి. కమిటీ నివేదిక ఇచ్చాక.. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేస్తారన్న సీఎం కేసీఆర్ ప్రకటన వల్ల.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. ఫ్లాట్లను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావట్లేదు. ఎందుకు తెలుసా?
రానున్న రోజుల్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేస్తే.. వేలాది ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుంది. పైగా, అక్కడ స్థలాల ధరలు కోకాపేట్‌తో పోల్చితే తక్కువకే దొరుకుతాయి. ఇప్పుడు కాకపోయినా, కనీసం ఒకట్రెండేళ్లకు ఆ జీవోను ఎత్తివేసినా ఫర్వాలేదు.. భూముల ధరలైతే తగ్గిపోతాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అధిక రేటు పెట్టి ఫ్లాటును కొనడం బదులు కొంతకాలం వేచి చూద్దామని బయ్యర్లు భావిస్తున్నారు. ఎందుకంటే, ఒక బడా ప్రాజెక్టు పూర్తవ్వడానికి ఎంతలేదన్నా నాలుగైదేళ్లు పడుతుంది. ఇప్పుడు అధిక రేటు పెట్టి కొనడం బదులు కొంతకాలం వేచి చూస్తే.. తక్కువ రేటుకే కొనవచ్చని అధిక శాతం మంది బయ్యర్లు భావిస్తున్నారు. అందుకే, చాలామంది పశ్చిమ హైదరాబాద్‌లోని ఆ కీలకమైన ప్రాంతాల్లో ఫ్లాట్లను కొనడానికి వెనకడుగు వేస్తున్నారు.
This website uses cookies.