Categories: TOP STORIES

బడ్జెట్లో బ‌య్య‌ర్ల‌ను క‌రుణిస్తారా?

  • కొనుగోలుదారులకు ప్రయోజనం

    కల్పించే చర్యలు చేపడతారా?

  • డెవలపర్లపై భారం తగ్గించే నిర్ణయాలుంటాయా?

  • నిర్మ‌లా సీతారామ‌న్ రియాల్టీని ప్రోత్స‌హిస్తారా?

దేశ ఆర్థికాభివృద్ధిలో రియల్ రంగానిది కీలకపాత్ర. స్థిరాస్తి రంగం ఎంత బాగుంటే దేశ ఆర్థిక పరిస్థితి అంత బాగుంటుంది. కరోనా తర్వాత నుంచి ఇటీవల కాలం వరకు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, భారత రియల్ రంగం దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ ఎలా ఉంటుంద‌నేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. రియల్ ప్లేయర్లు, గృహ కొనుగోలుదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి శుభవార్త చెబుతారా లేదా అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ రంగానికి ఊతమిచ్చే నిర్ణయాలు రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ 2025-26లో.. డెవలపర్లపై జీఎస్టీ భారాన్న తగ్గించడం, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ పునరుద్ధరణ, గృహ రుణ వడ్డీలో సవరణ, ఎఫ్‌డీఐ నిబంధనల సడలింపులపై రియల్ ఎస్టేట్ రంగం దృష్టి సారిస్తోంది. 2024లో భారత స్థిరాస్తి రంగం ఎన్నడూ లేనంత బలంగా సాగింది. గతేడాది భారత రియల్ మార్కెట్ గణనీయమైన వృద్ధి సాధించింది. రెసిడెన్షియల్ సెగ్మెంట్, ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్, అంతిమ-వినియోగదారులు, కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తూ మెరుగైన పనితీరును కనబరిచింది. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే రియల్ ఎస్టేట్ రంగానికి మరింత ఊతమిచ్చే చర్యలను కేంద్రం చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రానున్న బడ్జెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని వృద్ధి దిశగా పయనింపజేసే అవకాశం ఉంటుందని సుమ‌ధుర గ్రూప్ ఛైర్మ‌న్ జి.మ‌ధుసూద‌న్ తెలిపారు. “గృహ కొనుగోలుదారులకు మెరుగైన పన్ను ప్రయోజనాల్ని ఇవ్వాల‌ని రియల్ రంగం కోరుతోంది. ప్రత్యేకించి హౌసింగ్ డిమాండ్‌ను పెంచడానికి గృహ రుణ వడ్డీకి అధిక మినహాయింపు పరిమితి ఇవ్వాలి. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలపై జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణతోపాటు గ్రీన్, సస్టెయినబుల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా డెవలపర్లకు లిక్విడిటీని పెంపొందించే విధానాలు తీసుకురావడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించాలి’ అని ఆయన పేర్కొన్నారు.

డెవలపర్లు, కొనుగోలుదారులు ఇరువురికీ ప్రయోజనం చేకూర్చే సమతుల్య విధానం ఉండాలని సాస్ ఇన్‌ఫ్రా గ్రూప్ ఛైర్మ‌న్ జీ వెంక‌టేశ్వ‌ర్రావు అభిప్రాయ‌ప‌డ్డారు. ‘రియల్ ఎస్టేట్‌ను పరిశ్రమగా గుర్తించడం వల్ల నిధుల ల‌భ్య‌త సుల‌భ‌త‌రం అవుతుంది. అనుమతుల ప్రక్రియ వేగ‌వంతం అవుతుంది. పెట్టుబడులను ఆకర్షించడం క‌ష్ట‌మేం కాదు.

చివ‌రికి, ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. డెవలపర్లపై జీఎస్టీ భారాన్ని తగ్గించడంతోపాటు తొలిసారి ఇల్లు కొంటున్నవారికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (సీఎల్ఎస్ఎస్) పునరుద్ధరించడం ద్వారా ప్రాపర్టీ ధరలను స్థిరీకరించవచ్చు. తద్వారా హౌసింగ్ మార్కెట్‌ను పెంచొచ్చు’ అని వివరించారు. అలాగే సెక్షన్ 24(బి) కింద హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును రూ. 5 లక్షలకు సవరించడం, మూలధన లాభాల పన్నును పునఃసమీక్షించడం ద్వారా సెగ్మెంట్లలో లిక్విడిటీని మెరుగుపరచొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. పట్టణ మౌలిక సదుపాయాల పెట్టుబడికి ప్రాధాన్యత ఇవ్వడం, గ్రీన్ బిల్డింగ్ నిర్మాణాలకు ప్రోత్సాహకాలు ఇస్తే.. జాతీయ వాతావరణ లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన, నివాసయోగ్యమైన నగరాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

ప్రాజెక్టు అనుమతులను వేగవంతం చేయడానికి దేశ‌వ్యాప్తంగా సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌లను ప్రవేశపెట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నట్టు జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా శ్యామ్ సుంద‌ర్‌రెడ్డి తెలిపారు. దీని వల్ల సమయం ఆదా అవుతుందని, తద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఆలస్యం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి, ముఖ్యంగా ఆర్థికాభివృద్ధికి ఇంజిన్లుగా మారుతున్న టైర్-2 నగరాలకు బడ్జెట్ లో పెద్ద పీట వేసే అవకాశం ఉందని ప్ర‌త్యుష్ డెవ‌ల‌ప‌ర్స్ ఎండీ ర‌వీంద‌ర్‌రెడ్డి తెలిపారు.

This website uses cookies.