బెంగళూరుకు చెందిన లిస్టెడ్ డెవలపర్ బ్రిగేడ్ గ్రూప్ హైదరాబాద్ లో భారీ పెట్టుబడి పెట్టనుంది. రూ.4500 కోట్ల పెట్టుబడితో 10 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మించనుంది. బ్రిగేడ్ గేట్‌వే రెసిడెన్సెస్ పేరుతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నగరంలో అత్యంత ఎత్తైన భవనాలలో ఒకటి కానుంది. ఇందులో వరల్డ్ ట్రేడ్ సెంటర్, మాల్, హోటల్‌తో పాటు బ్రిగేడ్ గేట్‌వే రెసిడెన్స్ లు ఉంటాయి. కోకాపేట నియోపోలిస్ లో చేపట్టిన ఈ ప్రాజెక్టులో వరల్డ్ ట్రేడ్ సెంటర్, బ్రిగేడ్ రెసిడెన్సెస్, 300+ కీ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్, డెస్టినేషన్ లైఫ్‌స్టైల్ మాల్, బ్రిగేడ్స్ ఓరియన్ మాల్ ఉంటాయి. 2.4 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బ్రిగేడ్ గేట్‌వే రెసిడెన్సెస్ హైదరాబాద్‌లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా నిలవనుంది. 58 అంతస్తులలో 3, 4, డ్యూప్లెక్స్ 5-బెడ్‌రూమ్ ఫార్మాట్‌లలో దాదాపు 600 ప్రీమియం నివాసాలను కలిగి ఉంటుంది. 58 అంతస్తుల నివాస ఆకాశహర్మ్యంలో 50,000 చదరపు అడుగుల ప్రీమియం క్లబ్‌హౌస్ కూడా ఉంటుంది. కంపెనీ మొత్తం రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్లలో సగం ఫ్లాట్లను రూ.4 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు విక్రయించాలని యోచిస్తోంది.
212 మీటర్ల ఎత్తులో ఉండే కమర్షియల్ టవర్‌లో మొదటి ఏడు అంతస్తుల్లో ఓరియన్ మాల్, 22 అంతస్తుల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్, 12 అంతస్తుల్లో ఇంటర్‌కాంటినెంటల్, రెండు అంతస్తులు సర్వీస్ రెసిడెన్సీలకు కేటాయించారు. వాణిజ్య స్థలం 2.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒక మిలియన్ చదరపు అడుగుల అభివృద్ధి సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్రిగేడ్ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న నాల్గవ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇది. హైదరాబాద్ లో తాము చేపట్టిన ఈ ప్రాజెక్టు 45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, ఇందులో దాదాపు 25 లక్షల చదరపు అడుగుల విలాసవంతమైన గృహాలు ఉంటాయని బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసూర్ తెలిపారు.
This website uses cookies.