తెలంగాణలో రియల్ ఎస్టేట్ దూకుడు తమ అతిపెద్ద విజయమని, ఎకరం భూమి రూ.100 కోట్లు పలకడం తెలంగాణ పరపతికి నిదర్శనమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తరచుగా చెబుతుంటారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఈ అంశాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందని, ఆలోచించి ఓటేయాలని కేటీఆర్ కోరుతున్నారు. దీనికి సంబంధించి తన లాజిక్ ఏమిటనేది ఓ టీవీ కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. ‘ప్రతి ఆరు నెలలకు ఓసారి ముఖ్యమంత్రి మారితే రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుంది. వారు పాలసీలను సరిగా అమలు చేయలేరు. ఢిల్లీ వెళ్లకుండా అభ్యర్థులను కూడా ఖరారు చేయలేరు. అలాగే వారు అధికారంలోకి వస్తే పాలసీ వ్యవహారాలకు కూడా ఢిల్లీ ఆమోదం పొందాలి. దీంతో విపరీతమైన జాప్యం జరిగి పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతారు’ అని వివరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బెంగళూరులో ఆఫీస్ స్పేస్ డిమాండ్ 28 శాతం పడిపోయిందని, తెలంగాణలో మాత్రం పెరిగిందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలపై సరిగా స్పందించడంలేదనే వాదనలున్నాయి. ఆ పార్టీలో సీఎం సీటును ఆశించే నేతలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అందువల్లనే సీఎం మార్పు ఉండదని, సుస్థిర సర్కారు ఉంటుందని గట్టిగా ఎవరూ చెప్పడంలేదు. తరచుగా సీఎంలను మార్చే చరిత్ర కాంగ్రెస్ కు ఉంది. అయితే, ఇటీవల ఆ సమస్య తగ్గింది. కానీ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆ పార్టీ హైకమాండ్ విఫలమవుతోంది. సీఎం అభ్యర్థి విషయంలో హైకమాండ్ దే అంతిమ నిర్ణయమని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు గట్టిగా చెబితే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.