ట్రిపుల్ వన్ జీవో రద్దు హైదరాబాద్ రియాల్టీ మీద పెద్దగా ఉండదు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మంత్రిమండలి ద్వారా జీవోను రద్దు చేసినట్లు ప్రకటించింది. కాబట్టి, ఇది రాజకీయపరమైన నిర్ణయం. ఈ అంశం ఎన్జీటీ, సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. రాష్ట్ర హైకోర్టులో ఈ అంశంపై కేసు ఉంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనా? అని కోర్టులు తేల్చాల్సి ఉంటుంది.
కేసీఆర్ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టుకు సైతం నివేదించాలి.
జంట జలాశయాల్ని కాపాడేందుకు తీసుకునే పటిష్ఠమైన చర్యల్ని తెలియజేయాలి.
111 జీవో రద్దు న్యాయస్థానాల తుది నిర్ణయంపై ఆధారపడుతుందని నిపుణులు అంగీకరిస్తున్నారు.
ప్రకటన చేశారు కదా.. మరెలా?
ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి మండలి ప్రకటించింది. మరి, దీని ప్రభావం రియల్ రంగంపై ఎలా పడుతుంది?
తొలుత కోకాపేట్ చేరువలో ఉన్న గండిపేట్, మోకిలా, మెయినాబాద్, అజీజ్ నగర్ వంటి ప్రాంతాల్లో.. కొందరు రియల్టర్లు, బ్రోకర్లు కృత్రిమంగా భూముల ధరల్ని పెంచేస్తారు. ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎకరం రూ.5 నుంచి 15 కోట్ల దాకా ఉంది.
ఇక్కడేదో రాత్రికి రాత్రే అద్భుతం జరుగుతుందని భావించేవారు.. రేటు ఎక్కువైనా సరే అని.. వెనకా ముందు చూడకుండా భూముల్ని కొనేందుకు ముందుకొస్తున్నారు.
భూముల ధరలు, వాటి లభ్యత గురించి అడిగేవారి సంఖ్య అధికమైంది. భూముల్ని స్వయంగా వెళ్లి చూసేవారి సంఖ్య కొద్ది రోజుల్నుంచి మార్కెట్లో పెరిగారు.
ట్రిపుల్ వన్ జీవో రద్దు వల్ల కోకాపేట్‌లో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్టుల మీద పడదు. ఎందుకంటే, కోకాపేట్లో జరిగిన మౌలిక సదుపాయాల అభివృద్ధి స్థాయికి ట్రిపుల్ వన్ జీవో ప్రాంతాలు చేరుకోవడానికి కనీసం దశాబ్దం అయినా అవుతుంది. అది కూడా కోర్టులు అనుమతినిస్తేనే!
111 జీవో రద్దు వల్ల పశ్చిమ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గుముఖం పడే అవకాశముంది. ఫలితంగా, కొత్త నివాస సముదాయాల్లో ఫ్లాట్ల ధరలను కొంతమేరకు తగ్గించి బిల్డర్లు విక్రయించే ఆస్కారముంది. దీంతో పాత, కొత్త ప్రాజెక్టుల మధ్య రేటు విషయంలో కాస్త పోటీ పెరుగుతుంది.
ప్రస్తుత పరిస్థితిలో కోకాపేట్లో ఆరంభమైన ప్రాజెక్టుల మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు. ఎందుకంటే, ఇవి పూర్తిగా ఉన్నత వర్గాలకు సంబంధించిన నిర్మాణాలు కాబట్టి.. ప్రతి అంశాన్ని పక్కాగా ఆలోచించాకే వీరు కొనుగోలు చేస్తారనే విషయం మర్చిపోవద్దు.
ఇప్పుడేం చేయాలి?
ట్రిపుల్ వన్ జీవోకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ విడుదలతైనే ఏయే ప్రాంతాల్లో బడా రోడ్లు వస్తాయి? ఆకాశహర్మ్యాల్ని ఎక్కడ అనుమతినిస్తారు? ఎక్కడెక్కడ వాణిజ్య సముదాయాల్ని కడతారు? మల్టీపుల్ జోన్‌కు అవకాశం ఎక్కడిస్తారు? ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్లు వంటి వాటిని అనుమతినిచ్చేదెక్కడ తదతర విషయాలపై స్పష్టత వస్తుంది. లేకపోతే, ఇప్పుడు కోట్లు పెట్టి భూముల్ని కొనుగోలు చేసినా.. రేపొద్దున ఆయా భూములు మాస్టర్ ప్లాన్ రోడ్డు పరిధిలోకి వచ్చినా.. కన్జర్వేషన్ జోన్ పరిధిలో వచ్చినా ఇబ్బంది అవుతుంది. పైగా, కోట్ల రూపాయలు కాస్త బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కాబట్టి, ఇప్పుడే ఎగబడి ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో భూములు కొనడం బదులు, కాస్త స్పష్టత వచ్చాక కొనడమే అన్నివిధాల ఉత్తమం.