అసలే ప్రపంచ దేశాల్ని అల్లకల్లోలం చేస్తున్న ఆర్థికమాంద్యం.. మరోవైపు మళ్లీ భయపెట్టడానికి సిద్ధమవుతున్న కరోనా.. తగ్గుముఖం పట్టిన అమ్మకాలు.. బిల్డర్లకు పెరుగుతున్న అప్పులు, దానిపై వడ్డీలు.. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం 2023 కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్ మీదే ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా ఈ రంగానికి పరిశ్రమ హోదా కల్పించాలని కోరడంతో పాటు పన్ను మినహాయింపులు, హేతుబద్ధ విధానాలు, ప్రోత్సాహకాలు అందించాలని విన్నవిస్తున్నారు. ఇక ప్రాజెక్టులను సింగిల్ విండో విధానంలో ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం కింద ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కొనసాగించాలని.. నివాస కార్యకలాపాలు, వినియోగదారుల సెంటిమెంట్లను పెంచడానికి ఎస్ డబ్ల్యూఏఎంఐఐహెచ్ నిధిని రూ.5 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్లకు పెంచాలని కోరుతున్నారు. మరికొన్ని ఆకాంక్షలివీ..
సంస్థలు, ఎల్ఎల్పీల ఆదాయ పన్ను రేటును కార్పొరేషన్ పన్ను రేట్లతో సమం చేసి.. దాదాపు 25 శాతంగా ఉంచాలి.
అందరికీ ఇల్లు లక్ష్యం సాధించడానికి రాష్ట్ర అద్దె గృహాల విధానాన్ని ఖరారు చేయాలి
దీర్ఘకాల మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధించాలి. అలాగే దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా అర్హత
పొందేందుకు హౌస్ ప్రాపర్టీ హోల్డింగ్ వ్యవధిని 24-36 నెలల నుంచి 12 నెలలకు తగ్గించాలి.
గృహరుణాలపై ప్రిన్సిపల్ డిడక్షన్ పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచాలి.
క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 20 శాతం నుంచి తగ్గించాలి.
రెండు ప్రాపర్టీల్లో పెట్టుబడి పెట్టేందుకు క్యాపిటల్ గెయిన్స్ పై విధించిన రూ.2 కోట్ల పరిమితిని తొలగించాలి.
గృహ కొనుగోలుదారులకు అధిక పన్ను మినహాయింపు ఇవ్వాలి. గృహ రుణాలపై వడ్డీ చెల్లింపు కోసం మినహాయింపు పరిమితిని ఏడాదికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి.
స్టీల్, సిమెంట్, టైల్స్ వంటి నిర్మాణ సామగ్రికి ప్రభుత్వం జీఎస్టీని హేతుబద్ధం చేయాలి.
గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీ రెండింటిపై పన్ను రాయితీ పెంచాలి.
ప్రాజెక్టుల సత్వర అనుమతికి వీలుగా సింగిల్ విండో విధానం తీసుకురావాలి.