అయ్యో.. అదేంటీ.. ప్రీలాంచ్‌లో కొన్నవారు జైలుకెందుకు వెళతారనేది మీ సందేహమా? ఇందులో కొన్నవారు ఏయే సందర్భంలో జైలుకు వెళ్లే అవకాశముందో తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు.
ప్రీలాంచ్ అంటే కేవలం మీరు స్థలం మీదే పెట్టుబడి పెడుతున్నారు. అంతేతప్ప అపార్టుమెంట్ మీద కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే, మీరు వంద శాతం సొమ్మును ప్రీలాంచ్ ప్రమోటర్‌కు ఇచ్చేటప్పుడు.. మీకు అక్కడ అపార్టుమెంట్ కనిపించట్లేదు. అసలు అపార్టుమెంట్ లేనే లేదక్కడ. ప్రీలాంచ్లో ఫ్లాట్లు అమ్మే ప్రమోటర్ అయినా ఏజెంట్ అయినా.. ఒక భూమి చూపెట్టి.. దాన్ని మీద అపార్టుమెంట్ కడతామని చెప్పి.. మీ వద్ద ముందే వంద శాతం సొమ్ము తీసుకుంటున్నారు. అంటే ఒక పేపర్ మీద ఏదో ఒక ప్లాను గీసి.. ఆ ప్లాన్ ప్రకారం కడతామని చెబితే.. అది నమ్మి మీరు అందులో పెట్టుబడి పెడుతున్నారు. అది కూడా ఒకేసారి సొమ్ము పెడుతున్నారు. ఆ తర్వాత ప్రీలాంచ్ ప్రమోటర్ ఏం చేస్తాడంటే.. మీరు పెట్టిన సొమ్ముకు గాను.. కొంత స్థలాన్ని యూడీఎస్ కింద మీకు రిజిస్టర్ చేసిస్తాడు. దీంతో, మీలాంటి వారంతా ఏమనుకుంటారు? ఇక తమ సొమ్ముకు పూర్తి భద్రత లభించిందని భావిస్తారు. కానీ, ఇక్కడో తిరకాసు ఉందనే విషయాన్ని మీరు గమనించాలి.
ఇక్కడ ప్లాటు యజమాని, ప్రీలాంచ్ ప్రమోటర్‌తో పాటు మీరూ ఆయా ప్రాజెక్టులో సహ భాగస్వామి అయ్యారు. ఎందుకంటే, స్థలంలో కొంత భాగం మీ పేరు మీద కూడా రిజిస్టర్ అవ్వడమే అందుకు ప్రధాన కారణం. మీలాగే ఆయా ల్యాండ్‌ని ప్రీలాంచ్‌లో కొన్నవారంతా జాయింట్ ప్రమోటర్లు అయిపోతారు. అంటే, ప్రీలాంచ్ ప్రమోటర్లతో సమానం అన్నమాట. ఆ తర్వాత సదరు ప్రీలాంచ్ ప్రమోటర్ ఏం చేస్తాడంటే.. ప్రాజెక్టుకు సంబంధించి ప్రీలాంచ్ బయ్యర్ల నుంచి వచ్చే ఒత్తిడిని భరించలేక.. అపార్టుమెంట్ నిర్మాణ పనుల్ని ఆరంభిస్తాడు. అనుమతి వచ్చినా.. రాకపోయినా.. కట్టడమైతే ప్రారంభిస్తాడు. భువనతేజ ఇన్‌ఫ్రా అనే ప్రీలాంచ్ ప్రమోటరే ఇందుకు తాజా నిదర్శనం. ఈ సంస్థ ఆరంభించిన అపార్టుమెంట్లలో వేటికి హెచ్ఎండీఏ అనుమతి ఉందో నేటికీ చాలామందికి తెలియదు. అయినా, ఆ ప్రమోటర్ బయ్యర్లకు చూపించుకోవడానికి నిర్మాణ పనుల్ని చేస్తున్నాడని అందులో కొన్నవారే చెబుతున్నారు.
ఇలా మీలాంటి బయ్యర్ల నుంచి సొమ్ము వసూలు చేసే ప్రీలాంచ్ ప్రమోటర్లు.. 10 శాతమో లేదా 25 శాతమో సొమ్ము అడ్వాన్సుగా చెల్లించి.. మిగతా మొత్తాన్ని ప్రీలాంచుల రూపంలో కొనుగోలుదారుల నుంచి వసూలు చేసి.. ఆ మొత్తాన్ని స్థలం కోసం కట్టేస్తారు. అయితే ప్రీలాంచుల్లో అమ్మిన సొమ్మంతా తీసుకుని వచ్చి.. స్థలం కొనేందుకు వెచ్చిస్తే.. ఇక నిర్మాణం ఎలా చేపడతారు?
రెండు వందలు అపార్టుమెంట్లలో వంద అమ్మేశాడు. సొమ్మంతా వెళ్లి స్థల యజమానికి చెల్లించాడు. ఇక అనుమతులు తీసుకుని, నిర్మాణాన్ని ప్రారంభించాలి. సరిగ్గా ఇక్కడే అనుమతులకు సంబంధించి స్థానిక సంస్థ నుంచి అనుమతి రాకపోతే.. ఆయా స్థలం కన్జర్వేషన్ జోన్ పరిధిలోనో.. లేదా మాస్టర్ ప్లాన్ ప్రకారం.. ఇతర జోన్లలో ఉంటే.. ఆయా భూమిని ల్యాండ్ కన్వర్షన్ చేయాలి. అందుకోసం ఎంతకాలం పడుతుందో ఎవరూ చెప్పలేరు.
ఒకవేళ ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని ఆరంభమైన తర్వాత ప్రీలాంచ్ ప్రమోటర్ అర్థాంతరంగా ప్రాజెక్టును నిలిపివేసినా.. ఇతర కారణాల వల్ల ఆయా నిర్మాణం నిలిచిపోయినా.. అంతే సంగతులు. మీరు అందులో సహభాగస్వామి కాబట్టి.. మీ మీద కూడా పోలీసు కేసు నమోదయ్యే అవకాశముంది. ప్రీలాంచ్ ప్రమోటర్తో పాట జైలుకెళ్లి ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి, ప్రీలాంచ్‌లో ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ కొనుగోలు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకోవడమెందుకు? వాటికి దూరంగా ఉండటమే అన్నివిధాల మంచిది.