Categories: TOP STORIES

ఈ పెంట్ హౌస్ చాలా కాస్ట్ లీ గురూ..

సాధారణంగా పెంట్ హౌస్ కాస్త తక్కువ ధరకే వస్తుంది. ఆ అపార్ట్ మెంట్లో ఫ్లాట్ ధరల కంటే తక్కువే ఉంటుంది. కానీ ఈ పెంట్ హౌస్ ధర వింటే మాత్రం వామ్మో అని అనకుండా ఉండలేరు. దీని ధర ఏకంగా రూ.1133 కోట్లు. దుబాయ్ లోని అత్యంత ఖరీదైన పామ్ జుమేరియా ప్రాంతంలో నిర్మిస్తున్న కోమో రెసిడెన్సీస్ అనే 71 అంతస్తుల అదిరిపోయే హైరైజ్ టవర్ పై ఇది రానుంది. ఈ టవర్ ను చూస్తే కళ్లు చెదిరిపోతాయి. అలాంటి అద్భుతమైన టవర్ పై 22వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందనున్న ఈ పెంట్ హౌస్ లో 5 బెడ్ రూమ్స్ ఉంటాయి. దీనిని తూర్పు యూరప్ కు చెందిన ఓ కుబేరుడు రూ.1133 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన పెంట్ హౌస్ లలో ఇది మూడోది కావడం విశేషం. దుబాయ్ లో అయితే, ఇదే అత్యధికం.

 

ఇక టవర్ గురించి చెప్పాలంటే చాలా సంగతులున్నాయి. దుబాయ్ లో వ్యూహాత్మకంగా ఎంతో కీలక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ఉండటం ఒక విశేషమైతే.. 360 డిగ్రీల స్కై పూల్ మరో ఆకర్షణ. ఈ టవర్ ఎత్తు 984 అడుగులు. దీని పైకి ఎక్కి చూస్తూ ఓ వైపు బుర్జ్ ఖలీఫా, మరోవైపు బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా కనువిందు చేస్తాయి. బెంజిలౌన్ ఆర్కిటెక్చర్, నఖీల్ కలిసి నిర్మిస్తున్న 71 అంతస్తుల ఈ ఖరీదైన సౌధంలో ఫ్లోర్ కు ఉండేవి ఒకటి లేదా రెండు ప్లాట్లు మాత్రమే. 2 బీహెచ్ కే నుంచి 7 బీహెచ్ కే వరకు ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేటు లిఫ్టులు, ప్రైవేటు శాండీ బీచ్ లు, 25 మీటర్ల లాప పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతున్నాయి.

రియల్టీ రంగంలో దుబాయ్ వేగంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. మనోళ్లతోపాటు దేశ విదేశాలకు చెందిన కుబేరులు ఇక్కడ ఇల్లు కొనుక్కోవడానికి ఎంతో మక్కువ చూపిస్తున్నారు. అందుకే దుబాయ్ లో ఇళ్ల ధరలు అక్కడి భవనాల్లాగానే చుక్కలనంటుతున్నాయి. ఈ నేపథ్యంలో 22 వేల చదరపు అడుగుల పెంట్ హౌస్ రూ.1133 కోట్లకు అమ్ముడైంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిని పెంట్ హౌస్ ఎక్కడుందో తెలుసా? మొనాకాలోని ఓడియన్ టవర్ పై ఉన్న పెంట్ హౌస్ ఏకంగా రూ.3670 కోట్లకు అమ్ముడై చరిత్ర సృష్టించింది. తర్వాత లండన్ లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1975 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.

This website uses cookies.