మీరు తెలంగాణలో ప్లాట్లను కొనాలని అనుకుంటున్నారా? అయితే, చెరువుల నుంచి సుమారు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లాట్లను కొనేటప్పుడు మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటంటే.. మీరు కొనే ప్లాటుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖ నుంచి ఎన్వోసీ లభించిందా? లేదా? అన్నది తెలుసుకున్నాకే తుది నిర్ణయానికి రావాలి. ఎందుకో తెలుసా?
ప్రభుత్వం జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్ మార్గదర్శకాల ప్రకారం.. నీటి వనరుల చుట్టూ 200 మీటర్లు.. అంటే 656.16 ఫీట్లు వరకు ఉన్న ప్లాట్లను క్రమబద్ధీకరణ చేయాలంటే తొలుత సర్వేను నిర్వహిస్తారు. ఈ సర్వే చేయడానికి బఫర్ జోన్ విస్తీర్ణాన్ని ఏడు రెట్లను పెంచారు. వాస్తవానికి, ఎంత పెద్ద చెరువులైనా బఫర్ జోన్ అనేది గరిష్ఠంగా 30 మీటర్లు అంటే 98.42 ఫీట్లు ఉంటుంది. నదులకైతే పట్టణ ప్రాంతాల్లో గరిష్ఠంగా 50 మీటర్లు అంటే 164.04 ఫీట్లు ఉంది. కాకపోతే, దీన్ని 200 మీటర్లు పెంచడంతో ప్లాట్లు కొన్నవారిలో కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే, ఈ ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ చేయాలంటే రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల చుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ ప్రక్రియను ఎలా చేపడతారనే అంశంపై ప్రభుత్వం ఒక వివరణ ఇవ్వాలని సామాన్యులు కోరుతున్నారు. అందుకే, చెరువుల నుంచి సుమారు పావు కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లాట్లను కొనేటప్పుడు అన్నీ పక్కాగా ఉంటేనే అడుగు ముందుకేయండి.