దాదాపు రెండేళ్ల విరామం తర్వాత.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటి అద్దెలు అనూహ్యంగా పెరిగాయి. ప్రధానంగా ఈ పెరుగుదల గేటెడ్ కమ్యూనిటీల్లో ఎక్కువగా కనిపించింది. అలాగనీ, ప్రతి కమ్యూనిటీలో అద్దెలు పెరగలేదు. కరోనా కారణంగా ఎక్కడైతే అద్దెలు గణనీయంగా తగ్గాయో.. వాటిలోనే కాస్త పెరిగాయి. ఉదాహరణకు, మియాపూర్‌లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ గేటెడ్ కమ్యూనిటీని తీసుకుంటే.. ప్రస్తుతం రెండు పడక గదుల ఫ్లాట్ అద్దె సుమారు రూ.25 వేలు చెబుతున్నారు. అదే, మూడు పడక గదుల ఫ్లాటయితే రూ.30 వేలకు చేరుకుంది. ప్రస్తుతం ఇందులో రెండు పడక గదుల ఫ్లాట్లు దొరకట్లేదు. గత నెల నుంచి ఖాళీగా ఉన్న ఫ్లాట్లలో అద్దెదారులు చేరారని తెలిసింది. రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్న పలు ఫ్లాట్లను పలువురు తీసుకున్నారని సమాచారం.
హఠాత్తుగా ఎందుకు ఫ్లాట్ల అద్దెలు పెరిగాయని ఆరా తీస్తే.. పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూళ్లు తెరుచుకోవడం, ఐటీ ఆఫీసులకు వెళ్లాల్సి రావడం వంటివి కొన్ని కారణాలని చెప్పొచ్చు. ఇవి కాకుండా, ఈ కమ్యూనిటీని నిర్వాహక సంఘం అందంగా రీడిజైన్ చేస్తోంది. అరోమా, ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో హరితమయం చేసింది. క్రమం తప్పకుండా సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించింది. జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి వాటిని ఆధునీకరించింది. ఈమధ్య కాలంలో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసింది. ఇలాంటి అనేక అంశాల కారణంగా.. ఫ్లాట్ల అద్దెలు పెరిగాయని స్కోవా సంఘం ఉపాధ్యక్షుడు సీతారామ్ కోరుకొండ తెలిపారు.