ఈ ప్రకటన చూసి కొందరు అమాయక కొనుగోలుదారులు వేలంవెర్రిలా ఫ్లాట్లు బుక్ చేశారు. కనీసం రశీదు కూడా తీసుకోకుండా రూ.5 లక్షలు అతని చేతిలో పోశారు. ఇంకేముంది.. స్థానిక సంస్థ నుంచి అనుమతి రాగానే.. బిల్డింగ్ కట్టగానే.. అందులో గృహప్రవేశం చేయవచ్చని కలలు కన్నారు. కొన్ని నెలల తర్వాత సదరు బిల్డర్‌కి ఫోన్ చేసి స్విచ్ఛాప్ వచ్చింది. మళ్లీ మళ్లీ చేసినా అదే పరిస్థితి.. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు. తీరిగ్గా రెరా అథారిటీ గడప తొక్కారు. ఫిర్యాదు చేశారు. కానీ ఏం లాభం? బిల్డర్‌కి సొమ్ము ఇచ్చినట్లు రశీదు కూడా తీసుకోలేదు. అడ్డంగా మునిగిపోయి లబోదిబోమంటున్నారు. డబ్బులిచ్చిన వారేమైనా నిరక్షరాస్యులా అంటే.. అందులో ఐటీ ఉద్యోగులూ ఉన్నారు.
ఫ్లాట్ తక్కువకు వస్తుందంటే చాలు.. కొందరు కొనుగోలుదారులు వేలంవెర్రిలా కొనేందుకు ఎగబడుతున్నారు. బిల్డర్ గత చరిత్ర ఏమిటి? అసలు ప్రాజెక్టును డెలివరి చేస్తాడా.. లేదా.. అనే అంశాన్ని ఆలోచించట్లేదు. హైదరాబాద్‌లో నమోదు అవుతున్న ప్రీలాంచ్ కేసుల బాధితుల్లో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, ప్రవాసుల తల్లిదండ్రులే ఉంటున్నారు. వీరంతా ప్రీలాంచ్ వల్ల నష్టభయం ఉంటుందనే అంశాన్ని తెలియక కొనట్లేదు. అంతా తెలిసే అడుగు ముందుకేస్తున్నారు. కాకపోతే, బిల్డర్లు చేతులు ఎత్తేశాక ఆకులు పట్టుకుంటున్నారు. రెరా ఆఫీసు చుట్టూ ప్రదిక్షణాలు చేస్తున్నారు. కాబట్టి, ఇప్పటికైనా కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. అన్ని చూసుకుని అడుగు ముందుకేయాలి.
ప్రగతి నగర్‌లో టూ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం రూ.41 లక్షలకే అంటూ ఒక బిల్డర్ సరికొత్త రాగం అందుకున్నాడు. నిజాంపేట్ కార్పొరేషన్ అనుమతి లేదు. రెరా అనుమతి తీసుకోలేదు. అయినా ఎంతో దర్జాగా రూ.41 లక్షలకే ఫ్లాట్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫ్లాట్లను విక్రయించడం ఆరంభించాడు. ప్రకటనలో ప్రచురించిన అపార్టుమెంట్ బొమ్మను చూస్తేనేమో.. అది పన్నెండు కంటే ఎక్కువ అంతస్తుల అపార్టుమెంట్ తరహాలో కనిపిస్తోంది. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి హంగులన్నీ ఉంటాయట. కానీ, ధరేమో.. రూ.41 లక్షలు చెబుతున్నాడు. ఇలాంటి అపార్టుమెంట్‌లో ఫ్లాట్ కొనవచ్చా? అని కొందరు బయ్యర్లు రియల్ ఎస్టేట్ గురుని సంప్రదించారు. దీంతో, ఈ విషయాన్ని రెరాకు నివేదించగా.. సదరు సంస్థకు నోటీసు పంపి.. ప్రాజెక్టు విలువలో పది శాతం జరిమానా విధిస్తామన్నారు.
మియాపూర్ డిమార్ట్ ఎదురుగా ఒక సంస్థ బహుళ అంతస్తుల భవనానికి సంబంధించిన హోర్డింగులను ఏర్పాటు చేసింది. అందులో ప్రాజెక్టు పేరే ఉంది తప్ప.. రెరా అనుమతి ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. మరి, ఇలాంటి ప్రాజెక్టులో కొనాలా? వద్దా? అంటే.. రెరా అనుమతి లభించాకే తీసుకోవాలి. పొరపాటున ప్రాజెక్టు ఆలస్యమైతే బయ్యర్లు అడ్డంగా ఇరుక్కుపోతారు. ఆయా బిల్డర్ గతంలో బహుళ అంతస్తుల భవనాల్ని కట్టాడా? ఒకవేళ నిర్మిస్తే ఎన్ని రోజుల్లో ఫ్లాట్లను బయ్యర్లకు అందజేశాడు? అతని ఆర్థిక సామర్థ్యం ఏమిటి? వంటి విషయాల్ని పక్కాగా తెలుసుకున్నాకే అడుగు ముందుకేయాలి.
This website uses cookies.