Categories: Rera

రెరా గురించి తెలుసుకుందామా..

భారత రియల్ రంగంలో జవాబుదారీతనం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ చట్టం, 2016ని తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో ఇది 2017 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఇది రెరా చట్టంగా ప్రాచుర్యం పొందింది. ఈ చట్టం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రెరా అంటే ఏమిటి?

రెరా అంటే.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీలను నియంత్రించడంలో జవాబుదారీతనం నిర్వహించే రెగ్యులేటరీ బాడీ. అనైతిక రియల్ ఎస్టేట్ డెవలపర్లు చేసే మోసాల నుంచి కొనుగోలుదారులను కాపాడుతుంది. రెరాలో నమోదైన ప్రాజెక్టులకు ప్రతిష్టాత్మకమైన ట్యాగ్ ను, కొనుగోలుదారులకు విశ్వాసాన్ని అందిస్తుంది.

రెరా ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

భారత ప్రభుత్వం రెరా చట్టాంన్ని 2016 మార్చి 26న ఆమోదించింది. అందులోని అన్ని నిబంధనలు 2017 మే ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. రెరా సత్వర వివాద పరిష్కారానికి న్యాయనిర్ణేత సంస్థగా కూడా పని చేస్తుంది.

రెరా వల్ల ప్రయోజనాలేంటి?

రెరాలో నమోదయ్యే ప్రాజెక్టులకు సంబంధించి ప్లాన్ లే ఔట్, ఏయే దశలు ఎప్పుడు పూర్తవుతాయి, ప్రాజెక్టు పూర్తి తేదీ, ఎప్పుడు అప్పగిస్తారు అనే వివరాలు తెలుస్తాయి. ప్రాపర్టీ నిర్మాణంలో ఏదైనా లోపం ఉంటే.. దానిని అప్పగించిన తర్వాత ఐదేళ్ల వరకు మరమ్మతులు చేసే బాధ్యత డెవలపరే తీసుకుంటాడు. పైగా లోపాలను 30 రోజుల్లోపు సరి చేయాలి. ఆస్తి అప్పగింతో జాప్యం చేస్తే డెవలపర్ కి జరిమానా విధిస్తారు.

రెరా తప్పనిసరా?

అవున. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగిన అన్ని రియల్ ఎస్టేట్ నిర్మాణం లేదా స్టార్టప్ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఏ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ అవసరం లేదు?

500 చదరపు మీటర్ల కంటే తక్కువ విస్తీర్ణం కలిగిన అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా వర్తించదు. అలాగే 8 అపార్ట్ మెంట్ యూనిట్ల కంటే తక్కువ లేదా సమానమైన భూభాగం ఉన్నవాటికి కూడా రెరా వర్తించదు.

రెరా వల్ల కొనుగోలుదారులకు వచ్చే ప్రయోజనాలు లభిస్తాయి?

అనైతిక బిల్డర్ల మోసపూరిత ప్రవర్తన నుంచి కొనుగోలుదారులకు ఉపశమనం అందిస్తుంది. బిల్డర్ నుంచి అపార్ట్ మెంట్ సరైన సమయానికి పొందడంలో సహాయం చేస్తుంది. ఒకవేళ డెలివరీ తేదీలో జాప్యం చేసే డెవలపర్లకు గరిష్టంగా మూడేళ్ల వరకు శిక్ష పడుతుంది. అంతేకాకుండా 2 శాతం వడ్డీని కూడా కొనుగోలుదారులకు చెల్లించాల్సి ఉంటుంది.

రెరా ఆమోదం పొందిన ప్రాజెక్టులో కొనుగోలు సురక్షితమేనా?

అవును. రెరా కింద రిజిస్టర్ అయిన ప్రాజెక్టులను కొనుగోలు చేయడం సురక్షితం, ఉత్తమం. రెరాలో కార్పెట్ ఏరియాకు మాత్రమే చెల్లిస్తారు. ఇందులో బిల్డర్లు సూపర్ బిల్టప్ ఏరియాకు చార్జి చేయలేరు.

రెరా ఆమోదం లేని ప్రాజెక్టులో కొనుగోలు సురక్షితమేనా?

లేదు. రెరా ఆమోదం పొందని ప్రాజెక్టులో కొనుగోలు చేయడం మంచి నిర్ణయం కాదు. దానివల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాంటి ప్రాజెక్టులో కొనుగోలు చేయడం చట్ట విరుద్దం కూడా. రెరాలో నమోదు కాని ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరించే అవకాశం ఉంది.

వెంచర్ ప్లాట్లకు రెరా వర్తిస్తుందా?

అవును. రెరా చట్టం ప్రకారం 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న వెంచర్ ప్లాట్లతో సహా ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టునూ రెరా కింద నమోదు చేయాలి. రెరాలో నమోదు చేయకుండా దానికి సంబంధించి ఎలాంటి ప్రచారం చేయకూడదు.

గ్రామీణ ప్రాంతాల్లో రెరా వర్తిస్తుందా?

అవును. గ్రామీణ ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పుడు రెరా నియంత్రణలో ఉన్నాయి. డెవలపర్లు తమ ప్రాజెక్టులను 90 రోజుల్లోపు నమోదు చేయకపోతే జరిమానా విధిస్తారు.

రెరా లేకుండా ప్లాట్ కొనవచ్చా?

లేదు. రెరా రిజిస్ట్రేషన్ ఇప్పుడు అన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అవసరం. చాలామంది అనైతిక బిల్డర్లు, ప్రాపర్టీ డెవలపర్లు రెరాలో ప్రాజెక్టులు నమోదు చేయకుండా ఆస్తులను విక్రయిస్తున్నారు. దీనివల్ల కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఉంది.

రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు రెరా వర్తిస్తుందా?

అవును. అభివృద్ధి విస్తీర్ణం 500 చదరపు మీటర్లు దాటితే లేదా 8 కంటే ఎక్కువ బిల్డింగ్ యూనిట్లు నిర్మిస్తే రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టులకు కూడా రెరా వర్తిస్తుంది.

This website uses cookies.