Categories: TOP STORIES

స్వదేశంలోనే శేషజీవితం

ఉద్యోగ విరమణ తర్వాత ఇండియాలో
స్థిరపడటానికే ఎన్నారైల మొగ్గు

ఇక్కడి ఆర్థిక ప్రయోజనాలు,
ఇతరత్రా లాభాలే కారణం

భారీగా డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన ప్రవాస భారతీయులు తమ శేష జీవితాన్ని మాత్రం స్వదేశంలోనే గడపాలని కోరుకుంటున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత ఇండియా వచ్చేయాలని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. స్వదేశంపై ఉండే మమకారంతోపాటు ఇక్కడ లభించే ఆర్థిక ప్రయోజనాలు, ఇతరత్రా అంశాలే ఇందుకు కారణంగా ఉన్నాయి.

కరోనా తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ చక్కని పనితీరు కనబరుస్తోంది. పైగా విదేశాలలో డబ్బు సంపాదించినవారు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉండటంతో చాలామంది ఎన్నారైలు భారత్ లో స్థిరాస్తి కొనుగోలుకు మొగ్గు చూపిస్తున్నారు. ఉద్యోగ విరమణకు చాలా దూరంలో ఉన్నవారు సైతం బలమైన ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. తాము ఇండియా తిరిగి వెళ్లేసరికి అక్కడ అన్నీ

ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి చీకూచింతా లేని జీవనాన్ని హాయిగా గడపాలని కోరుకుంటున్నారు. ఇటీవల ఎస్బీఎన్ఆర్ఐ ఓ సర్వే నిర్వహించింది. రిటైర్మెంట్ తర్వాత వారి ప్రణాళిక ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది. మ‌రి, ఈ స‌ర్వేలో ఏం తేలిందంటే..

ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, బ్రిటన్, సింగపూర్ నుంచి కనీసం 60 శాతం మంది ఎన్నారైలు తమ పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ఇండియాలోనే గడపాలని చూస్తున్నట్టు వెల్లడైంది. సింగపూర్ లో ఉన్నవారిలో 80 శాతం మంది, అమెరికాలో ఉన్నవారిలో 75 శాతం మంది, బ్రిటన్ లో ఉన్నవారిలో 70 శాతం మంది, కెనడాలో ఉన్నవారిలో 63 శాతం మంది స్వదేశానికి రావాలనుకుంటున్నట్టు చెప్పారు. మొత్తమ్మీద 72 శాతం మంది ఎన్నారైలు భారత్ లో చక్కని పెట్టుబడి మార్గాలున్నాయని భావిస్తున్నారు. ఈ విషయమే పదవీ విరమణ తర్వాత వారు స్వదేశీబాట పట్టాలనే నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ‘డిజిటలైజేషన్, స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలతో దేశం బలంగా పుంజుకుంటోంది. ఇది పెట్టుబడిదారులకు మంచి భవిష్యత్తు ఉంటుందనే భరోసా కలిగిస్తోంది. అలాగే ఎన్నారైలు తమ రిటైర్మెంట్ ప్లాన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయడంతోపాటు నిబంధనలు అర్థం చేసుకోవడం సులభతరం కావడంతో స్వదేశం వైపు చూస్తున్నారు’ అని సర్వే నిర్వహించిన ముదిత్ విజయ వర్గియా పేర్కొన్నారు.

This website uses cookies.