ఇళ్ల కొనుగోలుదారులకు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత జవాబుదారీగా చేసే ఉద్దేశంతో రెరా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను టెక్నికల్, లీగల్, ఫైనాన్షియల్, జనరల్ వారీగా గ్రేడింగ్ చేయనుంది. ఇందుకోసం బిల్డర్లు ప్రతి ఆరు నెలలకు ఓసారి వివరాలను ఆన్ లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు మహారాష్ట్ర రెరా నిర్ణయించింది.
ప్రాజెక్టులను గ్రేడింగ్ చేయడంలో దేశంలోనే మహా రెరా తొలి రెరాగా నిలిచింది. ఈ వివరాలను చూసిన కొనుగోలుదారులు ఆ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని నిర్ణయం తీసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా ప్రతి ప్రమోటర్ పూర్తి సమయం పనిచేసే అధికారితో ప్రజా ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వివరాలను ప్రాజెక్టు వద్ద ప్రదర్శించడంతోపాటు వెబ్ సైట్ లోనూ, ప్రకటనల్లో కూడా పొందుపరచాలని నిర్దేశించింది. సాంకేతిక విభాగానికి సంబంధించి ఇంటర్నల్, ఎక్సటర్నల్ లో ఎంత శాతం పని పూర్తయింది, నిర్దేశిత సమయానికి పని పూర్తయిందా లేదా? ఒకవేళ కాకుంటే ఎందుకు ఆలస్యమైంది? వార్షిక క్వాలిటీ సర్టిఫికెట్, గడువు పొడిగింపు దరఖాస్తు ఏమైనా చేశారా వంటివి బిల్డర్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ విభాగం కింద ఎంత మొత్తం ఇప్పటి వరకు ఖర్చు చేశారు? వార్షిక ఆడిట్ రిపోర్టు, ఏమైనా జరిమానాలు చెల్లించారా? బకాయిలు ఏమైనా ఉన్నాయా వంటివి చెప్పాలి. లీగల్ విభాగం కింద ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా? వారెంట్లు జారీ అయ్యాయా? ఎన్ సీఎల్టీ ప్రొసీడింగ్స్ సక్రమంగా ఉన్నాయా వివరించాలి. జనరల్ విభాగం కింద ఎన్ని ఫ్లాట్లు బుక్ అయ్యాయి? సొసైటీ ఏర్పాటు వివరాలు, ఎవరెవరికి ప్లాట్లు అసైన్ చేశారు, ఫిర్యాదు పరిష్కార అధికారి వివరాలు తెలియజేయాలి. ఈ వివరాలు అన్నీ నమోదు చేయడం వల్ల కొనుగోలుదారులు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుందని రెరా అధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విభాగాల కింద గ్రేడింగ్ చేస్తామని, తదుపరి దశలో మరిన్ని అంశాలు జోడిస్తామని వెల్లడించారు. ప్రతి ఆరు నెలలకు ఓసారి ఈ వివరాలు అప్ డేట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
This website uses cookies.